
- పీఎంతో సమావేశానికి 2 రోజుల ముందు కీలక పరిణామం
- ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారన్న ఆరోపణలు
- ముంపుపై ముందు నుంచి అభ్యంతరం చెబుతున్న తెలంగాణ
- మన వాదనలు వినిపిస్తే ప్రాజెక్టుకు నష్టమన్న యోచనలో ఏపీ
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించనున్న ప్రగతి మీటింగ్‌లో పోలవరం ముంపు అంశాన్ని ఎజెండా నుంచి కేంద్రం ఎత్తేసింది. బుధవారం నిర్వహించనున్న ప్రగతి మీటింగ్‌లో తొలుత పోలవరం ముంపు అంశాన్నే ఎజెండాలో ఫస్ట్ పాయింట్‌గా కేంద్రం పేర్కొన్నది. కానీ, మీటింగ్ 2 రోజులు ఉందనగా ఆ అంశాన్నే పక్కకు పెట్టేసింది. మీటింగ్‌లో భాగంగా తెలంగాణతోపాటు ఏపీ, చత్తీస్‌గఢ్, ఒడిశా అభిప్రాయాలను తీసుకోవాలని ప్రధాని భావించారు. ఉన్నట్టుండి పోలవరం అంశాన్ని కేంద్రం తొలగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పి ఈ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించేలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుతో మనకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆది నుంచి తెలంగాణ వాదిస్తున్నది. అందుకు అనుగుణంగా ప్రధాని ముందు అభ్యంతరాలను తెలియజేసేందుకు మన అధికారులు ఎజెండా అంశాలనూ సిద్ధం చేశారు. పోలవరం ప్రాజెక్టును వాస్తవానికి 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. అయితే, ఆ ఎత్తుతో నిర్మించి పూర్తిస్థాయిలో నీటిని స్టోర్ చేస్తే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో ముంపు మరో 53,393 ఎకరాలు పెరిగే అవకాశం ఉంది.
దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరపగా.. ప్రాజెక్టును పూర్థిస్థాయి సామర్థ్యంతో నిర్మించినా.. కేవలం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్ చేసుకునేలా కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా 15,277.84 ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఆ ఎత్తులోనూ నీటిని స్టోర్ చేస్తే మన దగ్గర 6 మండలాల్లోని 954 ఎకరాలు ముంపునకు గురి కానున్నాయి. దాంతోపాటు భద్రాచలం టౌన్, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లకూ ముంపు ముప్పు పొంచి ఉంది. దాంతోపాటు కిన్నెరసాని, ముర్రేడువాగు, మరో ఆరేడు స్థానిక వాగుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది.
దుమ్ముగూడెం ప్రాజెక్టు కింద 36 వాగులు వచ్చి చేరుతుండడంతో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వాటి డ్రైనేజీ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఈ క్రమంలోనే ముంపునకు సంబంధించి కచ్చితంగా సర్వే చేయించి డీమార్కేషన్ చేయించాలని తెలంగాణ పట్టుబడుతున్నది. కానీ, ఏపీ మాత్రం జాయింట్ సర్వేకు అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ వాదనల్లో నిజం లేదని కొట్టిపారేస్తున్నది. ఇప్పుడు ప్రధాని వద్ద మన వాదన వినిపిస్తే.. ప్రాజెక్టుకు నష్టం కలుగుతుందన్న యోచనలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారన్న వాదనలు వినిపిస్తున్నాయి.