జీఎస్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయొచ్చు

జీఎస్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయొచ్చు
  • కౌన్సిల్ రికమెండేషన్స్ నిర్బంధం కాదు
  • సముద్ర రవాణా చార్జీలపై పన్ను కుదరదు: సుప్రీం కోర్టు
  • గుజరాత్​ హైకోర్టు తీర్పుకే సమర్థన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్​టీ చట్టాలు చేయడానికి సమానమైన అధికారాలుంటాయనే తాజా సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసే జీఎస్​టీ కౌన్సిల్​ నిర్ణయాలు  వాటిపై నిర్బంధమేమీ​ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలు తలెత్తేందుకు ఆస్కారం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. 
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్​ సర్వీసెస్ టాక్స్ (జీఎస్​టీ) పై చట్టాలు చేయడానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమానమైన అధికారాలు ఉంటాయని సుప్రీం కోర్టు గురువారం తీర్పు చెప్పింది. జీఎస్​టీ కౌన్సిల్​ రికమండేషన్స్ మాత్రమే చేయగలుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిర్బంధించలేదని జస్టిస్​ చంద్రచూడ్​ నేతృత్వంలోని బెంచ్​ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్రాలను ఒకే తాటిపైకి తెచ్చేలా మాత్రమే జీఎస్​టీ కౌన్సిల్​ పనిచేస్తుందని పేర్కొంది.  ఫెడరల్​ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల అధికారాలను ఈ తీర్పు  మరోసారి నిర్వచించినట్లయింది. 2017 లో తెచ్చిన జీఎస్​టీ చట్టంలో తిరస్కరణ నిబంధనలు లేవని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అభిప్రాయాల్లో తేడా వచ్చినప్పుడు జీఎస్​టీ కౌన్సిల్​ చొరవ తీసుకుని పరిష్కరించాలని సుప్రీం కోర్టు బెంచ్ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య సమన్వయం కుదిరేలా జీఎస్​టీ కౌన్సిల్​ బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. గతంలో గుజరాత్​ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పుపై కేసు  విచారణకు రావడంతో సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది.  అంతకు ముందు అమలులో ఉన్న ఒక పన్నుని మినహాయించి, తర్వాత తిరిగి విధించడాన్ని కొట్టివేసింది. దిగుమతిదారులపై  ఇంటిగ్రేటెడ్​ గూడ్స్​ అండ్​ సర్వీస్​ టాక్స్​ (ఐజీఎస్​టీ) విధించేందుకు అధికారం లేదని 2020లో గుజరాత్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పరాయి భూభాగంపై నుంచి అందిస్తున్న సేవలపై ఇక్కడ పన్ను విధించడం సమంజసం కాదని గుజరాత్​ హైకోర్టు పేర్కొంది. ఇప్పుడు సుప్రీం కోర్టు.. గుజరాత్​ హైకోర్టు తీర్పుని సమర్థించింది. ఓషన్​ ఫ్రైట్​ (సముద్ర రవాణా చార్జీలు)పై ఐజీఎస్​టీ విధించడాన్ని మోహిత్​ మినరల్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ చాలెంజ్​ చేస్తూ ఈ కేసును వేసింది. ఓడలో సరుకు రవాణా సేవలపై 5 శాతం ఐజీఎస్​టీ విధిస్తూ 2017 లో కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్​ను తెచ్చింది. గుజరాత్​ హైకోర్టు ఈ నోటిఫికేషన్​ చెల్లదంటూ కొట్టివేసింది.