- డేటా ఎంట్రీ, కాల్ సెంటర్ జాబ్స్ పేరిట ట్రాప్
- బ్యాంకాక్ మీదుగా థాయ్‌లాండ్, మయన్మార్ కు తరలింపు
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న సూత్రధారి సునీల్ నెల్లతు రామకృష్ణన్ అలియాస్ కృష్ణను సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. ముంబైలోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించి మయన్మార్, కంబోడియాలోని మానవ అక్రమ రవాణా కార్యకలాపాలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకుంది. సునీల్ నెల్లతు వివరాలను శుక్రవారం ఓ పత్రిక ప్రకటనలో వెల్లడించింది.
ముంబై సెంట్రల్‌కు చెందిన సునీల్ మయన్మార్‌లో పనిచేస్తున్న సైబర్ స్కామ్ సెంటర్లతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించుకున్నాడు. డేటా ఎంట్రీ, కాల్ సెంటర్ ఉద్యోగాల పేరిట ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించేవాడు.
సైబర్ స్కామ్ డెన్స్..
థాయ్‌లాండ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులను ఇంటర్నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ సిండికేట్లు మొదట ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి మయన్మార్ మ్యావాడి ప్రాంతంలోని కేకే పార్క్ ఏరియాలో గల సైబర్ స్కామ్ సెంటర్లకు తరలిస్తారు. చైనా సహా థాయ్‌లాండ్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు ఆపరేట్ చేస్తున్న సైబర్ స్కామ్ సెంటర్లలో నియమిస్తారు. డిజిటల్ అరెస్ట్, రొమాన్స్ ఫ్రాడ్‌లు, క్రిప్టోకరెన్సీ, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ సహా వివిధ సైబర్ మోసాల్లో వారిని వినియోగిస్తారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తే వేధింపులకు గురిచేస్తారు.
గతేడాది మార్చి, నవంబర్‌లో రెస్క్యూ ఆపరేషన్..
ఇలాంటి సైబర్ స్కామ్‌లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు గతేడాది మార్చి, నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం రెస్క్యూ చేసింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ, ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సునీల్ 300 మందికి పైగా మయన్మార్‌కు తరలించినట్లు గుర్తించారు. ముంబైలోని సునీల్ నివాసంలో గురువారం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి అతడిని అరెస్ట్ చేశారు.
సునీల్ ఏజెంట్ల ద్వారా మయన్మార్‌కు తరలించిన వారిలో పలువురు తెలంగాణవాసులు ఉన్నట్లు గుర్తించారు. వీరిని గతంలో కేంద్రం రెస్క్యూ చేసి సొంతూళ్లకు తరలించింది. తెలంగాణలో బాధితుల ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 34 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.
