- ట్రైబల్ వర్సిటీకి రూ. 889 కోట్లు
- కృష్ణా జలవివాద పరిష్కారానికి ట్రిబ్యునల్
- తెలంగాణకు లబ్ధి చేకూర్చిన కేంద్ర కేబినెట్
- ఉజ్వల్’ సిలిండర్ పై రూ. 100 సబ్సిడీ పెంపు
- కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అను రాగ్ ఠాకూర్
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ తెలంగాణకు మేలు చేకూర్చే మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నది. నిజామాబాద్ లో పసుపుబోర్డు ఏర్పాటు చేయడంతోపాటు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ట్రైబల్ వర్సిటీని ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఏపీ, తెలంగాణ మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న కృష్ణా జలాల వివాదానికి పరిష్కార మార్గం చూపేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి ఇవాళ మీడియాకు వెల్లడించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల పాలమూరు సభలో మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నిన్న నిజామాబాద్ సభకు వచ్చిన ప్రధానికి పసుపు రైతులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. 24 గంటల లోపే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులుజారీ చేయడం విశేషం.
పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా కేవలం తెలంగాణ కే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. పసుపు బోర్డు ద్వారా రైతులు పండించిన పసుపు కొమ్ముల ప్రాసెసింగ్, ఎగుమతి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఉద్యోగావకాలు వస్తాయని వివరించారు. ఇందుకోసం ఏర్పాటయ్యే అత్యున్నత స్థాయి కమిటీలో కేంద్ర వ్యవసాయ, ఆయుష్, కుటుంబ సంక్షేమ, వాణిజ్య శాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోయే సమ్మక్క, సారక్క గిరిజన వర్సిటీకి రూ. 889 కోట్లను మొదటి దఫాగా కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ డెసిషన్ తీసుకుందని వెల్లడించారు.
మూడోది తెలంగాణ, ఏపీ మధ్య పెండింగ్ లో ఉన్న కృష్ణా జలాల వివాదం ఉందని, పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 2015లో కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆ కేసును వాపసు తీసుకుందని చెప్పారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని వివరించారు.