ఉద్యోగులతో సీఎం మీటింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్

ఉద్యోగులతో సీఎం మీటింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్
  • ఎన్నికల కోడ్ టైంలో ఉద్యోగులతో సీఎం మీటింగేంది?
  • ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పై రిపోర్ట్ ఇవ్వాలని సీఈఓకు ఆదేశం
  • భేటీలో జరిగిన చర్చలు, ఇచ్చిన హామీలపై ఆఫీసర్ల ఆరా
  • రిపోర్టు ఆధారంగా సీఎంకు, ఉద్యోగ నేతలకు ఈసీ నోటీసులిచ్చే చాన్స్
  • మంత్రులు, ఎమ్మెల్యేలపైనా ఎన్నో ‘కోడ్’ కంప్లయింట్స్

ఎన్నో ఫిర్యాదులు
ఎన్నికల సమయంలో, ఆ ప్రాంతంలో ఓటర్లను ప్రభావితం చేసేలా అధికారులెవరూ ప్రజాప్రతినిధులను పర్సనల్గా కలిసేందుకు వీలులేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్తోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కోడ్ ఉల్లంఘించారంటూ అనేక కంప్లయింట్స్ వెళ్లాయి. ఇందులో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే  మైనంపల్లి, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డిపై ఈసీ ఇప్పటికే ఎంక్వైరీ రిపోర్ట్ అడిగింది. ఉద్యోగులను బెదిరించేలా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడింది నిజమేనని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని అధికారులు రిపోర్ట్ కూడా ఇచ్చారు. 
హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం భేటీ కావడంపై రిపోర్ట్ ఇవ్వాలని సీఈఓ(చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్)ను ఆదేశించింది. ఉద్యోగులను ప్రభావితం చేసేలా ఈ నెల 10న ప్రగతి భవన్లో జరిగిన సమావేశానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై పూర్తి వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన సీఈఓ.. వెంటనే ఎంక్వైరీ రిపోర్ట్ఇవ్వాలని హైదరాబాద్ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ రోజు జరిగిన ఉద్యోగ సంఘాల భేటీ, అందులో జరిగిన చర్చలు, ఇచ్చిన హామీల గురించి ఆఫీసర్లు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ రిపోర్టు ఆధారంగా సీఎంకు, సంబంధిత ఉద్యోగ సంఘాల నేతలకు ఈసీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కోడ్ ఉల్లంఘిస్తూ ఇటీవల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్, టీచర్స్ అసోసియేషన్స్తో మంత్రి కేటీఆర్ కూడా మీటింగ్ నిర్వహించారు. దీనిపైనా ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ మధ్య మంత్రి కేటీఆర్ను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కలవడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఇక  పాపిరెడ్డి.. కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నేరుగా మీటింగ్ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమానికి అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని పిలిచారనే ఫిర్యాదు అందింది. టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల పేరుతో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఫొటోలు పెట్టడంపైనా సీఈఓకు కంప్లయింట్అందింది. దీనిపై ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాలని మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీని ఆదేశించారు.
ఉద్యోగులతో సమ్మేళనాలు
ఆత్మీయ సమ్మేళనాల పేరిట మంత్రులు మీటింగ్స్ పెట్టడం వివాదాస్పదంగా మారింది. మంత్రులు తమ శాఖల పరిధిలోని ఉద్యోగులందరినీ ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఒక చోట చేర్చి.. ప్రమోషన్లు, పీఆర్సీలపై హామీలు ఇవ్వడం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో పంచాయతీ కార్యదర్శులు మొదలుకుని జెడ్పీ సీఈఓ వరకు పంచాయతీరాజ్ శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగులతో భారీగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ హాజరై అనేక హామీలు గుప్పించారు. ఇదే సభకు వచ్చిన ‘హైదరాబాద్’ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి.. తనకు ఓటేయాలని కోరారు. మంత్రుల సమక్షంలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు అన్ని శాఖల ఉద్యోగులతో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో జరిగాయి.
ఆఫీసుల్లో టీజీఓలు.. 
ఫోన్లు చేసి టీఎన్జీవోలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఉద్యోగులను టీఎన్జీవో, టీజీవోలు కోరుతున్నాయి. ఎన్నికల కోడ్ ముగియగానే పీఆర్సీ ఇస్తామని సీఎం చెప్పారని, అధికార పార్టీకి ఓటు వేయాలని చెబుతున్నాయి. ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం.. హైదరాబాద్ లోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు టీజీవో నేతలు వెళ్లి ఓటు వేయాలని కోరారు. ఇక టీఎన్జీవో నేతలు 6 ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల వివరాలు సేకరించి ఫోన్లు చేస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు.
ప్రైవేటైజేషన్ పేరుతో బెదిరించి..
ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను ఆయా సంస్థల పెద్దాఫీసర్లు, ఇంజనీర్లు ప్రైవేటైజేషన్ బూచి చూపి భయపెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకుంటే విద్యుత్ రంగం, సింగరేణి ప్రైవేటుపరం అయిపోతాయని, దీన్ని ఆపాలంటే అధికార పార్టీని గెలిపించాలని ఆయా సంస్థల ఉన్నతాధికారులు బెదిరింపులకు దిగుతున్నారని తెలిసింది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి.. పవర్ సంస్థల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులను పిలిపించి మాట్లాడారని, దీనిపై వారికి దిశానిర్దేశం చేశారని  జోరుగా ప్రచారం జరుగుతోంది.