కమీషన్ల కోసం కేంద్ర నిధులు మళ్లిస్తున్నరు

కమీషన్ల కోసం కేంద్ర నిధులు మళ్లిస్తున్నరు
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
  • జుక్కల్ లో ‘ప్రజాగోస బీజేపీ భరోసా’ యాత్ర

కామారెడ్డి/ పిట్లం, వెలుగు: టీఆర్​ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కురుకుపోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ తిన్న అవినీతి సొమ్ముంతా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కక్కిస్తామని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. కేసీఆర్ కుటుంబం మాత్రం ఆస్తులు పెంచుకుంటోందని ఆరోపించారు. బీజేపీ చేపట్టిన ‘ప్రజా గోస-– బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా మూడో రోజైన శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండలంలో బైక్​ర్యాలీ నిర్వహించారు. పిట్లం, తిమ్మానగర్, మర్ధండ, కంబాపూర్, కారేగాం, చిన్న కొడప్​గల్, బూర్నపూర్, అల్లాపూర్, పారేడ్ పల్లిలో బైక్ ర్యాలీలు జరిగాయి.

ఆయా గ్రామాల్లో పార్టీ జెండా ఎగరేశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పేరిట కేసీఆర్ కమీషన్లు దండుకుంటున్నారని అన్నారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కేవలం కేసీఆర్ ఫామ్​హౌస్ కే నీళ్లు వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణం కోసం నిధులు ఇస్తే.. వాటిని కమీషన్ల కోసం ఇరిగేషన్​కు మళ్లించారని ఆరోపించారు. టీఆర్​ఎస్ సర్కారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.

కేసీఆర్​కు ఓ ఫామ్​హౌస్, ఆయన కొడుక్కు, బిడ్డకు, అల్లుడికి, సడ్డాకుని కొడుక్కి ఇలా తలా ఒక ఫామ్ హౌస్ ఎట్లా వచ్చాయన్నారు. ప్రజలు కేసీఆర్​కు ఓటు వేసి అధికారం ఇచ్చింది పనులు చేస్తారని కానీ ఆస్తులు పెంచుకునేందుకు కాదన్నారు. ప్రశ్నించిన వారిపై పోలీసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధితో ప్రజలు ఇక్కడ కూడా బీజేపీ సర్కారు రావాలని కోరుకుంటున్నారన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో మినీ టెక్స్​టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి చేయలేదన్నారు. అలాగే నాగమడుగు లిప్ట్ ఇరిగేషన్ పనులు ఇంకా పూర్తి చేయలేదని అన్నారు. కార్యక్రమంలో కాటేపల్లి వెంకటరమణరెడ్డి, కాలకుంట్ల రాము, తేలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లు అధ్వానంగా ఉన్నయ్
జుక్కల్ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వివేక్ వెంకటస్వామి అన్నారు. పిట్లం, మార్దండ, కంబాపూర్, కారేగాం గ్రామాల పరిధిలో పూర్తిగా ధ్వంసమైన రోడ్లను ఆయన పరిశీలించారు. పిట్లం మండల కేంద్రంలో ని మెయిన్ రోడ్డు గుంతలు పడ్డాయి. నిజామాబాద్ నుంచి జహీరాబాద్ వరకు మార్గాన్ని హైవే గా గుర్తించి రోడ్డు నిర్మాణం కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

తిమ్మానగర్ నుంచి మార్దండ వరకు రోడ్డు కనీసం నడవటానికి కూడా విలులేకుండా ఉందని స్థానికులు తెలిపారు. మార్దండ శివారులో వరి నాట్లు వేసే మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి నాట్లు వేశారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార మాట్లాడుతూ దళిత బంధు కింద ఎంపిక చేస్తామంటూ టీఆర్ ఎస్​ లీడర్లు దళితుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని అన్నారు. అలాగే బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఇక సహించేది లేదన్నారు.