ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ఆర్డర్ -2018కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో నిన్న రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. పోలీసుశాఖ మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకూ ఈ జోన్ల విధానం వర్తిసుందని కేంద్ర హోం శాఖ తెలిపింది.
తెలంగాణా విజ్ఞప్తి మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు సవరిస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో చేరుస్తూ, కొత్తగా ఏర్పాటైన నారాయణ్ పేట్, ములుగు జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తెస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కొత్త జోనల్ విధానాన్ని రాష్ట్రపతి ఆమోదించడంతో రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు అడ్డంకులు తొలగిపోవడంతో పాటు విద్యార్థులకు, ఉద్యోగులకు చాలా ప్రయోజనాలు దక్కనున్నాయి. ముఖ్యంగా విద్యా ఉద్యోగావకాశాల్లో జిల్లాలకు తేడాలు తొలగిపోయి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానావకాశాలు దక్కనున్నాయి. స్థానిక రిజర్వేషన్లు కూడా పక్కాగా అమలుకానున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో జోన్ల విధానంతో తెలంగాణకు నష్టం జరిగిందనే భావనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక జోనల్ విధానం రూపొందించారు. నగరాలు, పట్టణాలు, ఇతర రకాలుగా అభివృద్ధి చెందిన జిల్లాలకే కాకుండా మారుమూల, ఏజెన్సీ, ఇతర వెనకబడిన జిల్లాలకు అన్ని విధాలా న్యాయం జరగాలని కొత్త జోనల్ విధానాన్ని ఖరారు చేశారు. ముందు 31 జిల్లాలకు జోనల్ విధానాన్ని రూపొందించారు. దానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ములుగు, నారాయణపేటలను కొత్తగా ఏర్పాటు చేశారు. మొత్తం 33 జిల్లాల పరిధిలో జోనల్ విధానానికి ఆమోదం కోరుతూ 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ విధానంతో ఉద్యోగ నియామకాలు జరగలేదు. ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశాలను పాత 10 జిల్లాల ప్రకారమే చేపడుతున్నారు. ఈ విధానంతో సమానత్వం సాధ్యం కావడం లేదు. కొత్త జోనల్ విధానం ఆమోదం పొందడంతో కొత్త ఉద్యోగ నియామకాలు దీని ద్వారానే జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రకటించింది. కొత్త జోనల్ విధానం వచ్చాక వాటిని చేపట్టాలనే భావనతో ఉంది. కొత్త విధానంతో నియామకాలు చేపడితే హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లోలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి సహా అన్ని జిల్లాల్లోని వారికి ఉద్యోగాలు దక్కనున్నాయి. విద్యాపరంగానూ అన్ని జిల్లాలకు ప్రవేశాలు దక్కుతాయి. ఈ కొత్త జోన్లతో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కానున్నాయి. జిల్లాలు, జోన్లవారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు కానుంది. దీని ఆధారంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపుల ప్రక్రియ జరుగుతుంది. కొత్తగా నియమితులైన వారికి జోనల్ కేటాయింపులు సులభం కానున్నాయి.
