‘కాళేశ్వరం’ పై కేంద్రం ఆరా

‘కాళేశ్వరం’ పై కేంద్రం ఆరా

మూడో టీఎంసీతో అదనపు ఆయకట్టు ఉందా?

ఎత్తిపోసిన నీళ్లతో ఎన్ని ఎకరాలు స్టెబిలైజ్‌ చేశారు

పెరిగిన వ్యయం వివరాలివ్వాలని రాష్ట్రానికి సీడబ్ల్యూసీ లేఖ

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. మూడో టీఎంసీతో అదనపు ఆయకట్టు ఏమైనా సాగులోకి వస్తుందా? అని, ఇప్పటి వరకు ఎత్తిపోసిన నీళ్లతో పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టును స్టెబిలైజ్‌‌ చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరింది. పెరిగిన ప్రాజెక్టు వ్యయం అంచనాలను తమకు సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ కృష్ణా–గోదావరి బేసిన్‌‌ డైరెక్టర్‌‌ ఎం.రఘురామ్‌‌ మంగళవారం రాష్ట్ర ఇరిగేషన్‌‌ ఈఎన్సీకి లేఖ రాశారు.

మళ్లీ క్లియరెన్స్​ తీసుకోవాలి

కాళేశ్వరం ప్రాజెక్టుకు 2015 నాటి ప్రతిపాదిత రేట్లతో ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ క్లియరెన్స్‌‌ తీసుకున్నారని, ప్రస్తుతం సవరించిన అంచనాలతో మళ్లీ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ క్లియరెన్స్‌‌ తీసుకోవాలని రఘురామ్​ సూచించారు. మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 98 రోజుల్లో 195 టీఎంసీలు ఎత్తిపోయడానికి 2015లో టెక్నికల్‌‌ అడ్వైజరీ కమిటీ అనుమతిచ్చిందని, ఇప్పుడు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయడానికి పనులు చేపడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఎత్తిపోసే మూడో టీఎంసీ నీళ్లతో కొత్త ఆయకట్టు ఏమైనా ఉందా, పాత ప్రాజెక్టుల కింది ఆయకట్టును స్టెబిలైజ్‌‌ చేసేందుకు ఈ పనులు చేస్తున్నారా? అనే వివరాలు ఇవ్వాలన్నారు. అడిషనల్‌‌ టీఎంసీ నీళ్లతో ఏ జిల్లాకు ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుందో టేబుల్‌‌ రూపంలో ఇవ్వాలన్నారు. మూడో టీఎంసీ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమర్పించాలన్నారు. టీఏసీ అనుమతిచ్చిన పనులకు అదనంగా ఏమైనా పనులు చేపట్టారా, దీనికి సంబంధించిన అదనపు సమాచారం సమర్పించాలన్నారు. కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్లతో రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ఆయకట్టును ఏమైనా స్టెబిలైజ్‌ చేశారా? అని ఆరా తీశారు. ఎస్సారెస్పీ స్టేజ్‌-1, స్టేజ్‌-2, ఎస్సారెస్పీ వరద కాలువ, సింగూరు, నిజాంసాగర్‌ల కింద ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చారా? అనే వివరాలు సమర్పించాలన్నారు.

అడిషనల్‌ టీఎంసీపై ఏం చెప్తరు

కాళేశ్వరం అడిషనల్‌ టీఎంసీ పనుల కింద కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టును ప్రతిపాదించలేదు. పాత ప్రాజెక్టుల కింద ఒక్క ఎకరాన్ని స్థిరీకరించడం లేదు. అలాంటప్పుడు రూ.26 వేల కోట్లకు పైగా ఖర్చుతో ఈ పనులు ఎందుకు చేస్తున్నారని కేంద్రం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లింక్‌-4 నుంచి ఏడో లింక్‌ వరకు ప్రతిపాదించిన ఆయకట్టుకు గతంలోనే టీఏసీ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఇప్పుడు అదే ఆయకట్టుకు నీళ్లివ్వడానికే అడిషనల్‌ టీఎంసీ పనులు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఇదే విషయాన్ని కేంద్రానికి చెప్తే టెక్నికల్‌గా చెల్లుబాటు కాదు. కొత్తగా ఒక్క ఎకరం ఆయకట్టు లేనప్పుడు ఇంత భారీ వ్యయంతో ఎందుకు పనులు చేస్తున్నారని నిలదీస్తే ఏం చెప్పాలో పాలుపోని స్థితిలో రాష్ట్రం ఉంది. అలాగే ప్రాజెక్టు లింక్‌-1, లింక్‌-4లో ప్రతిపాదిత ఆయకట్టు ఉన్నా దాదాపు రూ.70 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత కూడా ఒక్క ఎకరానికి ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోయారనే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.

జూన్‌లోనే కాస్ట్‌ అప్రైజల్‌ కోరిన కేంద్రం

కాళేశ్వరం నిర్మాణ వ్యయం రూ.80,190 కోట్లకు 2018లో టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ అనుమతినిచ్చింది. లింక్‌-1, 2లో పనుల వ్యయం భారీగా పెరగడం, మూడో టీఎంసీ పనులతో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.14 లక్షల కోట్లకు చేరింది. ప్రాజెక్టు పెరిగిన అంచనాలకు ఆమోదం పొందాలని జూన్‌లోనే సీడబ్ల్యూసీ రాష్ట్రానికి లేఖ రాసింది. దానికి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఇంత భారీ వ్యయాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని, ఈ ప్రాజెక్టు కింద ఒక్క ఎకరానికి కొత్తగా నీళ్లు ఇవ్వలేదని ‘వీ6 వెలుగు’ స్పెషల్‌ స్టోరీలతో వివరించింది.

For More News..

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అప్పులు తీసుకోవడానికే పనికొస్తది

లడఖ్​లో మళ్లీ టెన్షన్.. మూడు రోజుల్లో మూడోసారి..

6 వేల కోట్ల ఇన్‌కం టార్గెట్‌ పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం