
న్యూఢిల్లీ: నష్టాల్లో నడుస్తున్న మూడు ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా క్యాపిటల్ ఇవ్వనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. వీటి ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడానికి రూ.3,000 కోట్లను అందించనుందని అన్నారు. 2022–23 లో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యూనిటైడె ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం రూ.5,000 కోట్లు ఇచ్చింది.
ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్‌కు రూ.3,700 కోట్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌కు రూ.1,200 కోట్లు, యూనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు రూ.100 కోట్లు దక్కాయి. సరిపడినంత క్యాపిటల్ ఉందో? లేదో? కొలిచే సాల్వెన్సీ రేషియోని మెరుగుపరుచుకోవాలని ఈ కంపెనీలను ఆదేశించింది. ఒక్క న్యూ ఇండియా అష్యూరెన్స్ మినహా మిగిలిన మూడు ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీల సాల్వెన్సీ రేషియో రెగ్యులేటరీ రూల్ 150 శాతం కంటే దిగువన ఉంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సాల్వన్సీ రేషియో 63 శాతంగా, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీది 15 శాతంగా, యూనిటైడ్ ఇండియా ఇన్సూరెన్స్‌ది 51 శాతంగా ఉంది. ఈ మూడు కంపెనీలకు 2019–20 లోనూ ప్రభుత్వం రూ. 2,500 కోట్లు ఇచ్చింది.