
- ప్రమాదాలను తగ్గించేందుకు కొత్త గైడ్ లైన్స్ పై కసరత్తు
- తెలంగాణతో పాటు 12 రాష్ట్రాల్లో చర్యలకు నిర్ణయం
- రోడ్డు భద్రతా చర్యలకు రూ.7,700 కోట్లతో పనులు
హైదరాబాద్,వెలుగు: దేశ వ్యాప్తంగా నిత్యం జరుగుతున్న యాక్సిడెంట్లపై కేంద్రం దృష్టి పెట్టింది. వాటిని నివారించేందుకు కొత్త గైడ్ లైన్స్ రూపొందిస్తోంది. ట్రాన్స్ పోర్ట్, పోలీస్, ఆర్ అండ్ బీ, ఎడ్యుకేషన్, హెల్త్ డిపార్ట్ మెంట్లను భాగస్వామ్యం చేసి ఈ గైడ్ లైన్స్‌ను రాష్ర్టాల్లో అమలు చేయనుంది. నేషనల్హైవేలతో లింక్ఉన్న రాష్ట్రాల పరిధిలోని ప్రధాన రోడ్ల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా ఉపరితల మంత్రిత్వ శాఖ(మోర్ట్) ఉన్నతాధికారుల కసరత్తు చివరి దశకు చేరుకుంది. మరో రెండు నెలల్లో ఇవి అమల్లోకి రానున్నట్లు ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. ఈ మార్చి వరకే రాష్ట్రాలకు గైడ్ లైన్స్ అందాల్సి ఉండగా కొంత ఆలస్యమైంది.
12 రాష్ట్రాల ఎంపిక
దేశంలో ఏటా అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న12 రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. వాటిలో తెలంగాణ, ఏపీ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తొలి దశలో ఈ రాష్ట్రాల్లో ఐదేండ్ల పాటు చేపట్టే రోడ్డు భద్రతా చర్యలకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాల్లోని రహదారులకు సుమారు రూ.7,700 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధుల్లో 50 శాతం కేంద్ర రోడ్డు రవాణా ఉపరితల మంత్రిత్వ శాఖ ఇవ్వనుండగా, 25 శాతం ప్రపంచ బ్యాంకు, మరో 25 శాతం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రుణంగా పొందనుంది. ఈ నిధులను 12 రాష్ర్టాల్లో ఖర్చు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన వాటాగా ఏటా రూ.60 కోట్లు యాక్సిడెంట్ల నివారణకు ఖర్చు చేసే విధంగా గైడ్ లైన్స్‌ను రూపొందిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్లలో రూ. 360 కోట్లు ఖర్చ చేయనుంది.
బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
నేషనల్ హైవేలపై ఒకే ప్రదేశంలో ప్రమాదాలు తరచూ జరిగినప్పుడు సాధారణంగా ఆ ప్రాంతాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, స్టేట్ హైవేస్ అయితే ఆర్ అండ్‌బీ శాఖ బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తాయి. దానివద్ద ఇంజనీరింగ్ డిజైనింగ్ వర్క్‌లను మళ్లీ పరిశీలిస్తాయి. అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత విభాగ అధికారులు పని చేస్తారు. రాష్ట్ర రోడ్లపై జరిగే ప్రమాదాలను బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించేందుకు పోలీసు శాఖ నుంచి వచ్చే సమాచారాన్ని కీలకంగా తీసుకుంటారు. ప్రమాదాలు జరుగుతున్న తీరు, మృతులు, క్షతగాత్రులు గాయపడిన తీరు వైద్య శాఖ ద్వారా తెలుసుకొని ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సమాలోచనలు చేస్తారు. కాగా కేంద్రం రూపొందించనున్న ఈ గైడ్ లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేసేలా కేంద్రం దిశానిర్దేశం చేయనుంది. దశల వారీగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ గైడ్ లైన్స్ అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అయిదు శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ సలహాలు, సూచనలు ఇచ్చి ప్రమాదాలను నివారించాలని కేంద్రం యోచిస్తోంది.