కరోనా విషయంలో పూర్తి బాధ్యత కేంద్రానిదే

కరోనా విషయంలో పూర్తి బాధ్యత కేంద్రానిదే

హైదరాబాద్: కరోనా విషయంలో భయపడాల్సిందేమీ లేదని.. మహారాష్ట్ర, ఢిల్లీతో పోల్చితే తెలంగాణలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్‌‌ఎల్‌పీ ఆఫీసులో మీడియా చిట్‌చాట్‌‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితిపై ఆయన మాట్లాడారు. కరోనాపై పూర్తి బాద్యత కేంద్రానిదేనని చెప్పారు. తెలంగాణతోపాటు బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. కరోనాతో దేశమంతా ఇబ్బంది పడుతుంటే వ్యాక్సిన్ విషయంలో కేంద్రానికి ఒకరేటు రాష్ట్రాలకు మరోరేటు అవసరమా అని ప్రశ్నించారు. దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని.. మోడీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఉన్నా కేసులను అంచనా వెయ్యలేకపోయిందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఆలోచన చెయ్యాలని, దొరికింది కదా అని విచ్చలవిడిగా దోచుకోవద్దని కోరారు. 

‘మున్సిపల్ ఎన్నికలైనా ఏ ఎన్నిక అయినా ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం. టీఆర్ఎస్ రాజకీయ పార్టీ. మేం అందరితో కలసిపోతాం. ఎలక్షన్ కమిషన్ నాగార్జున సాగర్‌‌ ఎన్నికకు ముందు ప్రభుత్వాన్ని సంప్రదించింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని కూడా ప్రచారం చేస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని భావిస్తే దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలనూ కేంద్రం వాయిదా వెయ్యాలి. కుంభమేళా జరుగుతున్న సమయంలో మోడీ, అమిత్ షా ఎన్నికల ప్రచారం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి లాక్‌‌డౌన్‌‌పై ఇప్పుడైతే ఆలోచన లేదు. కేసులు విపరీతంగా పెరిగితే గానీ చెప్పలేం’ అని తలసాని స్పష్టం చేశారు.