మూడు నెలల్లో రాష్ట్రానికి పైసా ఇయ్యలే

మూడు నెలల్లో రాష్ట్రానికి పైసా ఇయ్యలే
  •     గ్రాంట్ ఇన్ ఎయిడ్ రిలీజ్​పై కేంద్రం నిర్లక్ష్యం
  •     ఏప్రిల్ నుంచి సొంత ఆదాయంతోనే నెట్టుకొచ్చిన రాష్ట్ర సర్కార్
  •     వివిధ రూపాల్లో ఖజానాకు రూ.48,790 కోట్లు
  •     కాగ్​కు ఆదాయ, ఖర్చుల వివరాలు అందజేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఒక్క పైసా రాష్ట్రానికి రాలేదు. ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు రాష్ట్ర సర్కార్ ఆదాయ, ఖర్చుల వివరాలను అందజేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు జీరోగా ఉన్నట్లు రిపోర్టులో ప్రభుత్వం పేర్కొన్నది. ఈ ఫైనాన్షియల్ ఇయర్​లో రూ.21,636 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.

 అయితే, ప్రతినెలా యావరేజ్​గా రూ.1,800 కోట్ల చొప్పున మూడు వేల కోట్లకుపైగా రావాల్సి ఉన్నా ఒక్క పైసా రాలేదు. ఇదిలా ఉంటే, రాష్ట్ర ఖజానాకు మూడు నెలల్లో వివిధ రూపాల్లో రూ.48,790 కోట్లు సమకూరాయి. జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, సేల్స్ ట్యాక్స్ వంటి వాటితో పాటు అప్పులు ఇందులోనే ఉన్నాయి. యావరేజ్ గా ప్రతినెలా రూ.5వేల కోట్లు అప్పు తీసుకునే చాన్స్ ఉన్నా.. ప్రభుత్వం అంతకంటే తక్కువే తీసుకున్నది. ప్రతినెలా వెయ్యి కోట్ల రూపాయల చొప్పున అప్పు తగ్గించుకున్నది. మొత్తం ఆదాయంలో పన్నుల ద్వారా రూ.34,609 కోట్లు రాగా, రూ.1,000 కోట్లు పన్నేతర ఆదాయం కింద సమకూరింది. 

నిరుడితో పోలిస్తే పెరిగిన ఆదాయం

గత ఆర్థిక సంవత్సరం జూన్ వరకు పన్నుల ద్వారా రూ.31 వేల కోట్ల ఆదాయం వచ్చింది. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది రూ.3,600 కోట్ల ఆదాయం పెరిగింది. ఇందులో 2024–25 ఫైనాన్షియల్ ఇయర్ తొలి మూడు నెలల్లో జీఎస్టీ ద్వారా అత్యధికంగా రూ.12,536 కోట్లు రాగా, సేల్స్ ట్యాక్స్ రూపంలో రూ.8,202 కోట్లు ఖజానాకు చేరాయి. ఏప్రిల్ నెలకు జూన్ నెలకు చూస్తే ట్యాక్స్ రెవెన్యూ కొంత పెరిగింది. 

పన్నుల రూపంలో ఏప్రిల్‌‌లో ఖజానాకు రూ.11,464 కోట్లు రాగా, మేలో ఆ మొత్తం రూ.10,954 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత మార్చిలో రూ.12,190 కోట్లు వచ్చింది. ఇక ఆర్బీఐ నుంచి అప్పుల ద్వారా రూ.13,171 కోట్లు సమకూర్చుకుంది. ఇక అన్ని రకాలుగా ఖజానాకు రూ.48,790 కోట్లు రాగా, అందులో ప్రభుత్వం రూ.45,320 కోట్లు ఖర్చు చేసింది.

ఎక్సైజ్ ఆదాయం రూ.4,785 కోట్లు

ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో రూ.4,785 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.3,449 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.3,635 కోట్లు ఖజానాకు చేరాయి. ఇతర పన్నుల రూపంలో మరో రూ.1,998 కోట్లు వచ్చాయి. ఇక జూన్ వరకు గతంలో చేసిన అప్పుల వడ్డీల చెల్లింపుల కోసం దాదాపు రూ.6వేల కోట్లు చెల్లించారు. ఉద్యోగుల సాలరీల కోసం మొదటి మూడు నెలల్లో రూ.11 ,026 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ రిపోర్టులో ప్రభుత్వం పేర్కొన్నది. మూలధన వ్యయం కింద రూ.6 ,058 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ప్రైమరీ లోటు రూ.7,237 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ.13 వేల కోట్లుగా నమోదైంది. రూ.3,652 కోట్లు రెవెన్యూ డిఫిసెట్ లో ప్రభుత్వం ఉన్నది.