హృదయ్ స్కీంలో పనులు..స్మార్ట్ సిటీ కింద మళ్లీ ప్రపొజల్స్
కేంద్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరామ్
‘‘వరంగల్ సిటీలో ఇంటింటికీ డ్రింకింగ్ వాటర్ కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద రూ. 545 కోట్లతో 93,311ఇండ్లకు కనెక్షన్స్ ఇచ్చింది. రాష్ట్ర సర్కారు మాత్రం దానికి మిషన్ భగీరథ పేరు పెట్టుకుంది. ఈ పనులు చేయడానికి రూ.548 కోట్లు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా ఇవ్వాలంటూ దొంగ ప్రపొజల్స్ పెట్టి నిధులను స్వాహా చేయాలని చూసింది’’ అని మినిస్ట్రీ ఆఫ్ జల్‌శక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజర్ వెదిరె శ్రీరామ్ చెప్పారు. మంగళవారం హన్మకొండలో ఆయన ఇంటలెక్చువల్ డిబేట్ ఏర్పాటు చేశారు. ‘‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సిటీలో ఇండ్ల నిర్మాణానికి కేంద్రం రూ.81 కోట్లు ఇచ్చింది. రాష్ట్రం డబుల్ బెడ్‍రూం ఇండ్ల కోసం రూ.81 కోట్లు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా ఇవ్వాలని మళ్లీ దొంగ ప్రపొజల్ పెట్టింది. హృదయ్ స్కీంలో భాగంగా వరంగల్ భద్రకాళి బండ్, వెయ్యి స్తంభాల గుడి, కాజీపేట దర్గా కోసం కేంద్రం రూ.33 కోట్లు ఇచ్చింది. కానీ ఇదే లెక్కతో స్మార్ట్ సిటీ ఫండ్స్ ఇవ్వాలంటూ మళ్లీ ప్రపొజల్ పంపారు. కేంద్ర నిధులతో పనులు చేసి, మంత్రి కేటీఆర్ ఫొటోలు దిగి అంతా తామే చేశామని చెప్పుకుంటున్నారు’’ అని అన్నారు.
స్మార్ట్ సిటీ అంటే.. నాలుగు రోడ్లేయడం కాదు
స్మార్ట్ సిటీ అంటే నాలుగు కొత్త రోడ్లు వేయడం కాదని.. సిటీ మొత్తాన్ని స్మార్ట్ గా ఉండేలా చూడాలని శ్రీరామ్ అన్నారు. వరంగల్ స్మార్ట్ సిటీ పనులకు ఇప్పటికే కేంద్రం రూ.196 కోట్లు రిలీజ్ చేసిందని, మిగతా రూ.304 కోట్లు విడుదల చేయడానికి యూసీలను రాష్ట్రం ఇవ్వట్లేదన్నారు. ఉడాన్ స్కీంలో మామునూరు ఎయిర్‍పోర్ట్ ను 1,200 ఎకరాల్లో పునరుద్ధరించేలా కేంద్రం చొరవ తీసుకుంటే.. మిగతా 439 ఎకరాల భూమిని టీఆర్‍ఎస్ ఇవ్వడంలో ఫెయిలైందన్నారు. మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు ఇవ్వాల్సిన పర్మిషన్లకు రెండేళ్ల టైం పట్టే అవకాశమున్నా.. కేంద్రం రెండు నెలల్లో అన్నీ క్లియర్ చేసినట్లు తెలిపారు.
