హిందీతో పాటు అన్ని భాషలు సమానమే

హిందీతో పాటు అన్ని భాషలు సమానమే

భావోద్వేగాలను రెచ్చగొట్టడం తేలిక. సామరస్యం సాధించడమే కష్టం. ఇది ఇల్లు కట్టడం.. కూల్చడం లాంటిదే! పార్లమెంట్‌ లో అధికార భాష పేరిట పనిచేస్తున్న కమిటీ తాజా నివేదిక ఇప్పుడు చేసిందదే! ఇంగ్లీష్‌ ను పరిహరించడం పేరిట, హిందీని దేశ ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రతిపాదనలు చేసిందనేది పరిశీలన. ప్రాంతీయ భాషామనోభావాల్ని దెబ్బతీసిందని విమర్శ కూడా! ఈ అంశం ఒక్క భాషకు సంబంధించినదే కాకుండా వైవిధ్యభరితమైన దేశంలో ఆయా రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలు, ఆత్మగౌరవం, యువకుల విద్య, -ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోనూ ముడివడి ఉన్నది. తాజా ప్రతిపాదన ఇప్పుడు దక్షిణాదిలో ఒక అలజడి రేపింది. ఒక్క ఏపీ మినహా దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సదరు ప్రతిపాదనలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎక్కడికక్కడ ప్రాంతీయ భాష-, హిందీ, -ఇంగ్లీష్‌ అనే ‘త్రిభాషా సూత్రం’తో అనుకూల, ప్రతికూల వాదనలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. మూడు, నాలుగు దశాబ్దాలుగా మూలనపడ్డ వివాదాన్ని దుమ్ముదులిపి, తెరపైకి తెచ్చినట్టే లెక్క! మరోపక్క కర్నాటక మినహా ఆయా రాష్ట్రాలు, కేంద్రంలోని అధికార బీజేపీకి రాజకీయ ప్రత్యర్థుల పాలనలో ఉండటం అగ్నికి ఆజ్యం పోసినట్టవుతున్నది. 

రాజకీయ అవసరాల కోసమేనా?

సమస్య తీవ్రత, అది చూపే ప్రతికూల ప్రభావాలు, ప్రాంతీయ భాషల అభివృద్ధి విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం,-నిర్వాకాలు కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఇంగ్లీషు భాషను అన్ని స్థాయిల్లో తప్పించి, దాని స్థానే హిందీని ఏకపక్షంగా ప్రతిష్టించడానికి కేంద్రం కుట్ర చేస్తున్నదన్నది ప్రభావిత రాష్ట్రాల అభియోగం. ‘ఒక దేశం, ఒక మతం, ఒక భాష’ అన్న ఆరెస్సెస్‌ సూత్రీకరణ అమలు కోసమే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వపు తాజా ప్రతిపాదనలనేది వారి అభిప్రాయం. ఇంగ్లీష్​ను తొలగించి హిందీతో పాటు ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేంద్రం చెబుతున్నది. అలా బయటకు కనిపిస్తున్నా వాస్తవానికి తాజా ప్రతిపాదనల్లో అటువంటిదేమీ లేదనేది విమర్శ. హిందీని తప్పనిసరి చేసే ప్రతిపాదనలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో, హిందీయేతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ భాషల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల విద్య, ఉద్యోగ అవకాశాలకు తాజా ప్రతిపాదనలు దెబ్బ అనేది ఆయా రాష్ట్రాల భావన. అలా అని, రేపు నిజంగానే హిందీని బలవంతపెట్టకుండా, జనంపై రుద్దకుండా, ఇంగ్లీష్‌ ను పూర్తిగా తొలగిస్తే, ప్రత్యామ్నాయంగా స్థానిక ప్రాంతీయ భాషల్ని తగిన విధంగా అభివృద్ధి చేశారా? అంటే, అదీ లేదు. రాజకీయ అవసరాల కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారే తప్ప ప్రాంతీయ భాషాభివృద్ధి బండి సున్నా! ఈ వైఫల్యానికి రాష్ట్రాలనే తప్పుబట్టాలి.

ప్రమాదం పొంచి ఉంది

కమిటీ చేసిన ప్రతిపాదనల్లో హిందీయేతర ప్రాంతాల వారి ప్రయోజనాలకు పెను ప్రమాదం పొంచి ఉందనేది దీన్ని వ్యతిరేకించే వారి భయం. భారత రాష్ట్రపతికి ఈ నెల 9న సమర్పించిన ఈ నివేదికలో ఇంగ్లీష్‌ను పూర్తిగా ఎత్తివేయమనడంతో పాటు ప్రత్యామ్నాయంగా హిందీ/ప్రాంతీయ భాషల్ని క్రమంగా దేశమంతటా ప్రతిష్టించమన్నట్టుగా సిఫారసులున్నాయి. సెంట్రల్‌ యూనివర్సిటీలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి కీలకవిద్యాసంస్థల్లో ఇకపై బోధనా మాధ్యమం ఇంగ్లీష్‌ కాకుండా హిందీలో(లేదా ప్రాంతీయ భాషలోనే) సాగాలి. పరీక్షలతో పాటు ఇతర సమాచార ప్రక్రియలన్నీ అలాగే ఉండాలనేది ప్రతిపాదన. ఉన్నత స్థాయిలోని కొన్ని ఎంపికలకు, ఇప్పుడున్నట్టు అభ్యర్థుల ఆంగ్ల భాషానైపుణ్యాలను పరీక్షించే స్థానే ఇకపై హిందీ భాషలో అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షించాలి. హిందీయేతర ప్రాంతీయ భాషల్లో కనీస డిగ్రీ, అర్హత కో ర్సులు చేసేవారు, తదుపరి పైచదువుల ఉద్యోగాల ఎంపికల కోసం హిందీలో ఒక అర్హత పరీక్ష తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. ఇవన్నీ కూడా హిందీరాని, నేర్చుకోదలచుకోని వారందరికీ ప్రతిబంధకమే! హిందీ వచ్చిన వారితో తలపడ్డప్పుడు సహజంగానే వారు పోటీలో వెనుకబడే ఆస్కారం ఉంటుంది. కోర్సుల్లో చేరికలు, ఉద్యోగ నియామకాల సందర్భంగా ఆయా సంస్థల్లో, విభాగాల్లో ఇవన్నీ పాటించకుండా నిర్లక్ష్యం చేసే అధికారులు ఏ విధంగా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ నివేదికలో ప్రతిపాదించారు. అఖిల భారత స్థాయి విద్యా సంస్థలంటే, వాటిల్లో ప్రవేశాలు ఎక్కడివారైనా తీసుకోవచ్చు. అలాంటప్పుడు హిందీ మాతృభాషగా ఉన్న ఉత్యధిక ఉత్తరాది రాష్ట్రాల్లోని సదరు సంస్థల్లో బోధనా మాధ్యమం నిర్బంధంగా హిందీయే అంటే, హిందీయేతర ప్రాంతాల పిల్లలు చేరడానికి ఇష్టపడరు. తద్వారా వారు తమ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

తెలుగు అభివృద్ధికి ఏం చేస్తున్నట్టు?

హిందీని బలవంతంగా రుద్దవద్దనే ప్రాంతీయ పాలకులు, మాతృభాషపై మాటలే తప్ప ఆచరణాత్మక మమకారం చూపరు. రేపు ఆంగ్ల భాషను అన్ని స్థాయిల్లో వద్దనుకున్నా, ప్రత్యామ్నాయంగా మన తెలుగు లాంటి ప్రాంతీయ భాషల్ని నిలుపుకోగలిగే రీతిలో భాషపై పరిశోధనలు, భాషాభివృద్ధి కోసం ఏ కృషీ చేయరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో ఘోరంగా విఫలమయ్యాయి. భాషాభివృద్ధికి ఏ ప్రత్యేక చర్యలూ ఉండవు. ఇతర దక్షిణాది మళయాల, తమిళ, కన్నడ భాషలతో పోల్చి చూసినా ఈ విషయంలో తెలుగునాట ఇప్పటివరకు చేసింది సున్నా. పాఠశాల విద్య మాతృభాష మాధ్యమంగా మంచిదనే వాదనను తరచూ తెరపైకి తెస్తారు. అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ, భాషాభివృద్ధి మండలి, సాహిత్య అకాడమీ వంటి పలు సంస్థలున్నా... అన్నీ అలంకార ప్రాయమే తప్ప ఆచరణ ఏమీ లేదు. ప్రపంచ తెలుగు మహాసభలను, దాదాపు వారం పాటు ఎల్బీస్టేడియంలో పెద్ద ఎత్తున జరిపి, ముఖ్యమంత్రే స్వయంగా పాల్గొని, ఎన్నో హామీలిచ్చి అయిదేండ్లవుతున్నా ఇప్పటికీ చాలా విషయాల్లో అతీగతీ లేదు. పరాయి వలసపాలకులు అరువు భాషగా ఇంగ్లీష్​ వద్దను కుంటున్నప్పుడు, ప్రత్యామ్నాయంగా మాతృభాష తెలుగును అభివృద్ధి పరచకుండా ఆర్భాటం చేయడం అనుచితం. ఇంగ్లీష్‌ పై నిష్కారణ ద్వేషంతో, తెలుగులోనే అన్ని స్థాయిల్లో విద్యార్జన చేయాలనుకునే వారికి ఏ సదుపాయం అందుబాటులోకి తేకుండా, జాతీయ- అంతర్జాతీయ పోటీల్లో ఆయుధాలు లేకుండా యుద్ధం చేయమని వారిని రంగంలోకి దించడం అనుచితం, అన్యాయం. పాలకులు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. తల్లి భాష తెలుగు విషయంలో మాటలకు చేతలకు ఎంతో కొంత పొంతన ఉండేలా చూసుకోవటం వారి కర్తవ్యమే కాదు బాధ్యత కూడా!

బలవంతం పనిచేయదు

ఇంగ్లీష్‌, హిందీ, ప్రాంతీయ భాషల విషయంలో పాలకులకు సరైన అవగాహన అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలోనే స్పష్టమైన భాషా విధానం ఉండి తీరాలి. విస్తృత ప్రజాభిప్రాయమే ఈ భాషా విధానాల రూపకల్పనకు ప్రాతిపదిక కావాలి. నిర్ణయాలు అలా జరగటం లేదు. అమిత్​షా నేతృత్వంలోని పార్లమెంటు కమిటీ తాజా ప్రతిపాదనలు ఇందుకొక ఉదాహరణ! నిజంగా ఈ ప్రతిపాదనలు దేశ ప్రజల ఉమ్మడి అభిప్రాయాలను ప్రతిబింబించటం లేదు. దేశంలో ‘ఇంగ్లీష్‌ హటావో’ ఉద్యమ పితామహుడిగా భావించే డాక్టర్‌ రామ్​మనోహర్‌ లోహియా ఆలోచనా స్రవంతికి కూడా ఇది భిన్నం! తాను చేసే ప్రతిపాదన, జరిపే ఉద్యమం ఆంగ్లాన్ని దేశం నుంచి తరిమికొట్టడానికే తప్ప హిందీని ప్రతిష్టించడానికి కాదని దేశ పౌరులంతా గ్రహించాలంటూ, ఆ రోజుల్లో లోహియా స్పష్టం చేశారు. దేశంలో అత్యధికులకు రాకుండా, కొద్దిమంది అధికారులకు ధారాళంగా వచ్చినంత మాత్రాన ఆంగ్లంలోనే మాట, రాత, కోత వంటి వ్యవహారాలన్నీ 
సాగాలనటం అన్యాయమని, తాము దాన్నే వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేసేవారు. ‘బోధన మాధ్యమంగా, అధికార వ్యవహారాల భాషగా ఆంగ్లం కొనసాగింపు ఎంత ప్రమాదకరమో, దాన్ని తొలగించి ప్రాంతీయ భాషల్ని ఖాతరు చేయకుండా హిందీని జనంపై రుద్దడం అంతకన్నా ప్రమాదమని ఆయన అప్పుడే చెప్పారు. హిందీ జాతీయ భాష అంటూ చేస్తున్న ప్రచారం కూడా సరైంది కాదు. రాజ్యాంగం 8వ షెడ్యూల్​లో నిర్దేశించినట్టు 22 అధికార భాషల్లో ఇతర ప్రాంతీయ భాషల్లాగే హిందీ ఒకటి. కాకపోతే, హిందీ భాష ఉత్తరాదిలోని బహుళ రాష్ట్రాల్లో మాతృ భాషగా ఉంది. హిందీతో సహా మన దేశీయ భాషలన్నీ సమానమేనని, లోహియా కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో నొక్కి చెప్పారు.
– దిలీప్ రెడ్డి, dileepreddy.ic@gmail.com