
- పాలనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలం
- బీజేపీ వైపే ప్రజలు చూస్తున్నరు
- స్థానిక ఎన్నికల్లోనూ
- మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా
- బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశమిస్తే.. ఆ రెండు పార్టీలూ పాలనలో విఫలమయ్యాయి. ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. మా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలనే భావనలో ఉన్నారు. హర్యానా, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించినట్టే.. తెలంగాణలోనూ గెలిపిస్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కాదు.. బీజేపీకి వంద సీట్లు వస్తాయి” అని అన్నారు.
శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉన్న సరస్వతి అమ్మవారిని, చార్మి నార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, అక్కడి నుంచి బీజేపీ ఆఫీసు వరకు ర్యాలీగా వచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులందరి సహకారంతో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని రాంచందర్ రావు చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు అన్ని సీట్లలో పోటీ చేస్తామని, అత్యధిక స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని అన్నారు.
యూరియాపై చర్చకు సిద్ధం..
హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రాంచందర్ రావు అన్నారు. ‘‘కాంగ్రెస్ ఎన్నికల టైమ్‌లో రైతులు, మహిళలు, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘డబ్బుల్లేవ్... ప్రభుత్వం భిక్షాటన స్థితిలో ఉంది’ అని ఏడుస్తున్నది. ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలేవీ అమలు చేయలేదు” అని మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా లేదంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. తెలంగాణకు అవసరమైన 12 లక్షల టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేసిందని, దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
‘‘ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అన్నట్టుగా తయారైంది. కాంగ్రెస్ నిర్వహించిన సామాజిక న్యాయ సమర భేరి సభలో మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను విమర్శించడమే తప్ప.. సామాజికంగా వెనుకబడిన వర్గాల గురించి కనీసం మాట్లాడలేదు. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ తర్వాతే రాజ్యాంగంలో సెక్యులరిజం, సోషలిజం పదాలు చేర్చారు. కాంగ్రెస్ మతపరమైన రాజకీయాలతో ఈ పదాలను చేర్చింది” అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, రాష్ట్ర నేతలు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్యారంటీలపై సీఎంకు లేఖ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాంచందర్ రావు.. సీఎం రేవంత్ రెడ్డికి తొలి లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను, 63 అనుబంధ హామీలను అమలు చేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు.