సోషల్ మీడియాలో పిల్లలను వేధించేటోళ్లను వదలం..చిన్నారులపై దురాగతాలను సహించం: సీఎం రేవంత్

సోషల్ మీడియాలో పిల్లలను వేధించేటోళ్లను వదలం..చిన్నారులపై దురాగతాలను సహించం: సీఎం రేవంత్
  • లైంగిక హింసను అందరూ ఖండించాలి.. చైల్డ్​ పోర్నోగ్రఫీ పూర్తిగా ఆగిపోవాలి 
  • ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తం
  • పోక్సో, జువైనల్ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తం
  • చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  సోషల్ మీడియాలో చిన్నారులను వేధించే వారిని వదలబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.  ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.  కోర్టుల్లోనే కాదు, పోలీస్ స్టేషన్లు, జైలు కేంద్రాలు, ప్రతి అడుగులోనూ పిల్లలకు న్యాయం, రక్షణ అందాలని అన్నారు. హైదరాబాద్​లోని ఎంసీఆర్​హెచ్ఆర్డీలో శనివారం ‘బాలలను లైంగిక నేరాల నుంచి రక్షించడం– వారి హక్కులు– -వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్” అనే  అంశంపై  నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ ​రెడ్డి మాట్లాడారు.  చిన్నారులపై జరుగుతున్న దారుణమైన నేరాలను ఆపడం  అందరి బాధ్యత అని పేర్కొన్నారు.  చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.  

 వారికి అత్యంత కఠినమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు.‘‘పిల్లలను లైంగిక వేధింపుల నుంచి కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నది. పిల్లలు, మహిళల రక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది” అని స్పష్టం చేశారు.  సోషల్ మీడియా ద్వారా పిల్లలపై దురాగతాలకు పాల్పడుతున్నవారిపై ఎలాంటి జాలి చూపకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు.  పోక్సో (పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం), జువైనల్ జస్టిస్ ఈ రెండూ మంచి చట్టాలు అని,  అయితే..  వాటిని అమలు చేసేటప్పుడు పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు.  చైల్డ్ పోర్నోగ్రఫీ పూర్తిగా ఆగిపోవాలని తెలిపారు. దీనికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడాలని అన్నారు.  

ప్రతి దశలోనూ రక్షణ ఉండాలి

రాష్ట్రంలో 29 భరోసా కేంద్రాలు ఉన్నాయని,  ఇవి పిల్లలకు పోలీసు సహాయం, న్యాయ సహాయం, వైద్య సేవలు, కౌన్సెలింగ్ అందిస్తున్నాయని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు.  కేవలం కోర్టుల్లో జరిగే న్యాయం తోపాటు  ప్రతి దశలోనూ చిన్నారులకు రక్షణ ఉండాలని పేర్కొన్నారు.  న్యాయమంటే కేవలం శిక్షలు విధించడం వరకే కాదని, బాధితుల జీవితానికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.  ఇందుకోసం వారికి అవసరమైన రక్షణ, సమాజంలో తగిన గౌరవం కల్పించేలా చర్యలు తీసుకొని, వారి బాల్యాన్ని తిరిగి పొందేలా చర్యలు ఉండాలన్నారు. 

హైదరాబాద్‌‌‌‌లో ఉన్న భరోసా కేంద్రం ద్వారా పిల్లల స్నేహపూర్వక కోర్టులను ప్రారంభించామని,  కేసులు త్వరగా పరిష్కరించడమే కాకుండా, పిల్లలకు సంపూర్ణ రక్షణ కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి, వారి హక్కులను కాపా డటానికి  చట్టాలు, నైతిక విలువలు ఎంతగానో ఉపయోగపడాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో  సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. 

కఠినంగా వ్యవహరిస్తున్నం : మంత్రి సీతక్క 

దేశంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లైంగిక నేరాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర  ప్రభుత్వం లైంగిక నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నదని స్పష్టం చేశారు. ‘‘గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి, వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. లైంగిక దాడులు జరిగినట్లు సమాచారం అందిన వెంటనే స్పందించి, బాధితులకు అండగా నిలిచాం. నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాం. 90% కేసుల్లో నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చేశాం’’ అని మంత్రి వివరించారు. 

బాధితులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వమే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. వారికి అందాల్సిన పరిహారాన్ని గ్రీన్ చానల్ ద్వారా త్వరితగతిన అందించే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  గంజాయి, మత్తు పదార్థాల వినియోగాన్ని, రవాణాను అణచివేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడితే లైంగిక దాడులు చాలా వరకు ఆగిపోతాయని సీతక్క అభిప్రాయపడ్డారు. చిన్న వయసు నుంచే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. మహిళా స్వయం సహాయక బృందాల సహకారంతో అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, కిశోర బాలికలు, కౌమార బాలికలందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.