
- మైనింగ్‌లో ఇంజనీరింగ్ చేసిన 36 మంది నుంచి ఎంపిక
- 14 రోజులు ట్రైనింగ్
- కోల్ బెల్ట్‌లో డిజాస్టర్ విమెన్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారి మహిళా ఉద్యోగులతో ఆల్- విమెన్ రెస్క్యూ టీమ్ ఏర్పడింది. విపత్తు నిర్వహణలో ట్రైనింగ్ తీసుకున్న మహిళలతో కోల్ బెల్ట్‌లో డిజాస్టర్ విమెన్స్ సెక్యూరిటీ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. 13 మంది మహిళా ఆఫీసర్లతో కూడిన తొలి బ్యాచ్‌కు పెద్దపల్లి జిల్లా జీడీకే- 2 ఇంక్లైన్ కాలనీలోని రెస్క్యూ సెంటర్‌లో 14 రోజుల ప్రత్యేక శిక్షణ పూర్తయింది. ఈ శిక్షణ కార్యక్రమం మహిళల సామర్థ్యాన్ని, ధైర్యాన్ని చాటడమే కాకుండా, సింగరేణి సంస్థలో లింగ సమానత్వం దిశగా ముందడుగుగా నిలిచింది. 2024 డిసెంబర్‌లో సింగరేణి నిర్వహించిన రిక్రూట్మెంట్లో 139 ఎక్స్‌టర్నల్ పోస్టుల్లో 36 మంది మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (ఎంజీటీ)లుగా చేరారు.
దీంతో సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 2 వేలకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఎన్‌సీఎల్, డబ్ల్యూసీఎల్ టీమ్‌లకు ధీటుగా మహిళా రెస్క్యూ టీమ్‌ను తీర్చిదిద్దేందుకు సింగరేణి శ్రీకారం చుట్టింది. సీఎండీ ఎన్. బలరాం నాయకత్వంలో మహిళా ఉద్యోగులను రెస్క్యూ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో శిక్షణ కార్యక్రమం చేపట్టారు. సంస్థలో పనిచేస్తున్న 36 మంది మహిళా మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీల నుంచి 21 నుంచి 30 ఏండ్లలోపు వయసు గల 13 మందిని ఎంపిక చేశారు. గోదావరిఖని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాలకు చెందిన ఈ మహిళలు భూగర్భ గనుల్లో అండర్ మేనేజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.
14 రోజుల పాటు వివిధ అంశాలపై శిక్షణ
14 రోజుల శిక్షణలో మైనింగ్ థియరీ, గ్యాస్ డిటెక్టర్ల వినియోగం, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్, రెస్క్యూ రికవరీ, స్పెషలైజ్డ్ ఎక్విప్‌మెంట్ హ్యాండ్లింగ్ లాంటి కీలక అంశాలపై మహిళా బృందానికి శిక్షణ ఇచ్చారు. గనుల్లో గ్యాస్ వ్యాప్తి నివారణకు గోడలు కట్టే పద్ధతులు, అగ్ని ప్రమాదాల్లో రక్షణ విధానాలు తదితర నైపుణ్యాలను నేర్పించారు. ఈ శిక్షణ మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడంతోపాటు విపత్కర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించింది.
సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందించిన సీఎండీ
తొలి మహిళా రెస్క్యూ టీమ్‌కు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎండీ ఎన్. బలరాం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీమ్ తమ సామర్థ్యాలను నిరూపించుకోవాలని, జాతీయ, అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో సింగరేణికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. రామగుండం-–2 ఏరియాలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి శిక్షణ కేంద్రంగా
తీర్చిదిద్దే ప్రణాళికలను వెల్లడించారు. సింగరేణి రెస్క్యూ బృందాలు గతంలో ఎస్‌ఎల్‌బీసీ, పాశమైలారం, తమిళనాడు ప్రమాదాల్లో విశిష్ట
సేవలందించిన విషయాన్ని గుర్తుచేశారు. సింగరేణిలో మహిళల రిక్రూట్మెంట్ పెరుగుతున్నదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ధైర్యంగా పనిచేసే వారితో రెస్క్యూ టీమ్ ను ఏర్పాటు చేసి, ట్రైనింగ్ ఇచ్చామన్నారు. ఇది సింగరేణి చరిత్రలోనే తొలిసారని బలరాం తెలిపారు. ట్రైనింగ్ తీసుకునేందుకు ముందుకు వచ్చిన మహిళా ఆఫీసర్లకు శిక్షణ ఇస్తున్నామని, మహిళల కోసం ఒక అండర్ గ్రౌండ్ మైన్, మరో ఓపెన్ కాస్ట్ మైన్ ను వినియోగిస్తున్నామని వెల్లడించారు.
గర్వంగా ఉంది..
-మాది ఖమ్మం జిల్లాలోని ఉసిరికాయలపల్లి గ్రామం. 2018లో బీటెక్ మైనింగ్ పూర్తి చేశాను. 2024 డిసెంబర్‌లో ఎంజీటీ ఉద్యోగం వచ్చింది. గోదావరిఖని వకీల్‌పల్లి మైన్‌లో అండర్ మేనే జర్‌గా పనిచేసే అవకాశం లభించింది. సింగరేణి రెస్క్యూ టీమ్‌లో పని చేయడం చాలా గర్వంగా ఉంది.- - బి.జీవన్మయి, వకీల్‌పల్లి మైన్, గోదావరిఖని
ఆత్మస్థైర్యం పెంచింది
మాది కరీంనగర్ జిల్లా కిష్టంపేట. పాల్వంచ కేఎస్ఎంలో 2019లో బీటెక్ మైనింగ్ చేశా. 2024 డిసెంబర్‌లో సింగరేణి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ(ఎంజీటీ)గా ఉద్యోగంలో చేరా. రెస్క్యూ బ్రిగేడియర్ శిక్షణ మాలో ఆత్మస్థైర్యం పెంచడంతోపాటు తోటివారికి సహాయ పడేలా చేస్తున్నది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో నేర్చుకున్నాం. - అల్లం నవ్యశ్రీ, ఎంజీటీ, జీడీకే-11
మైనింగ్‌లో రెస్క్యూ కీలకం
మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సోంపల్లి గ్రామం. 2019లో కేఎస్ఎంలో బీటెక్ పూర్తి చేశా. 2024 డిసెంబర్‌లో సింగరేణిలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ రెస్క్యూ టీం చాలా ముఖ్యమైంది. అత్యవసర పరిస్థితుల్లో మైన్‌లో కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందులో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది.- రమ్యశ్రీ, ఎంజీటీ, రెస్క్యూ టీం మెంబర్
రక్షించడమే లక్ష్యం
రెస్క్యూ అంటే రక్షించడం.. రక్షించుకోవడమే లక్ష్యం. మాకు ఫస్ట్ ఎయిడ్, రివైనింగ్, రక్షణ పద్ధతులు, గనుల్లో గ్యాస్ ఏర్పడితే గోడలు కట్టే విధానం, అత్యవసర సమయాల్లో స్పందించే పద్ధతి, అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు రక్షించడంపై శిక్షణ ఇచ్చారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఈ రెస్క్యూ టీమ్‌లో చేరాను.- స్వాతి, రెస్క్యూ టీం మెంబర్