ఈ బ్యాంక్ మేనేజర్ ఖతర్నాక్ : సర్కార్ సొమ్ము రూ.32 కోట్లను బెట్టింగ్‌లో పెట్టాడు..

ఈ బ్యాంక్ మేనేజర్ ఖతర్నాక్ : సర్కార్ సొమ్ము రూ.32 కోట్లను బెట్టింగ్‌లో పెట్టాడు..

ఇంట్లో ఉంటే డబ్బులు ఎక్కడ పోతాయో అని కష్టపడి సంపాదించిన పది రూపాయలను ప్రజలు బ్యాంకుల్లోనే దాచుకుంటున్నారు. అయితే ఈ రోజుల్లో బ్యాంకుల్లో డబ్బుకి కూడా సేఫ్టీ లేకుండా పోయింది. ఒకపక్క రోజురోజుకూ పెరిగిపోతున్న కొత్తరకం సైబర్ మోసాలు ఖాతాలను ఖాళీ చేస్తుంటే.. మరోపక్క కొందరు బ్యాంక్ ఉద్యోగులు కస్టమర్ల ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. 

తాజాగా ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకులో జరిగిన ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోటక్ బ్యాంకులోని ఒక బ్రాంచ్ మేనేజర్ తనకు ఉన్న బెట్టింగ్, జూదం అలవాట్లతో ఏకంగా బీహార్ ప్రభుత్వ బ్యాంక్ ఖాతా నుంచి రూ.31.93 కోట్లను తస్కరించినట్లు బయటపడింది. బ్యాంక్ మేనేజర్ కొట్టేసిన డబ్బును విదేశాలకు తరలించి దక్షిణ ఆఫ్రికా, ఫిలిప్పీన్స్ గేమింగ్ యాప్స్ ద్వారా వ్యవసనాలకు ఖర్చు చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. 

ALSO READ : జులై 15 నుంచి యూట్యూబ్ మానిటైజేషన్ కొత్త పాలసీ.. అలాంటి ఛానల్స్కు ఇకపై నో ఇన్కం!

అయితే సదరు మేనేజర్ చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు 21 విదేశీ బ్యాంక్ ఖాతాలు తెరిచాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇందుకోసం కోటక్ బ్యా్ంక్ కస్టమర్ల ఆధార్, కేవైసీ వివరాలను దుర్వినియోగం చేసినట్లు తేలింది. 2021లో దీనిపై పోలీసులు కేసు కట్టడంతో బ్యాంక్ ఉద్యోగం నుంచి అతడిని తొలగించింది. ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చాడు. కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఎలా జరిగిందనే వివరాలను బీహార్ పోలీసులకు అందించారు. వీటి ఆధారంగా పోలీసులు తాజాగా సదరు బ్యాంక్ మేనేజరు మీద కొత్తగా రెండో కేసును జూలై 27న ఫైల్ చేశారు. 

డబ్బును ప్రభుత్వ ఖాతా నుంచి తస్కరించేందుకు సదరు బ్రాంచ్ మేనేజర్ చెక్ క్లోనింగ్ విధానాన్ని ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. బీహార్ ప్రభుత్వం తరఫున అందించిన చెక్కులపై సంతకాలను ఉపయోగించి డబ్బును తాను తెరిచిన ఖాతాల్లోకి మళ్లించగలిగాడని గుర్తించారు. బ్రాంచ్ మేనేజరుగా సంతకం సరిగ్గా ఉందా లేదా అనే ఆథరైజేషన్ ఇచ్చే హక్కును ఉపయోగించుకుని రెండేళ్ల పాటు ఇదే మోసాన్ని అతడు కొనసాగించినట్లు తేలింది. ఈ డబ్బు మెుత్తాన్ని భారతదేశంలో బ్యాన్ చేయబడిన యాప్స్ ద్వారా జూదం, బెట్టింగ్ ఆడినట్లు విచారణలో తేల్చారు పోలీసులు.

అతితెలివైన మేనేజర్ ఎక్కడా తన పేరు బయటపడకుండా ఉండేందుకు కస్టమర్ కేవైసీ వివరాలతో ఓపెన్ చేసిన ఖాతాల ద్వారా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టాడు. అలాగే వారి ఖాతాల నుంచి డబ్బు ఎరగా జూపి కొందరి ఖాతాల్లోకి ఆడబ్బు పంపించి అక్కడి నుంచి తాను పొందేవాడు. ఇలా అయితే తన పేరు ఎక్కడా బయటకు పొక్కకుండా ఉంటుందని ప్లాన్ చేశాడని తేలింది. అయితే బీహార్ ప్రభుత్వానికి చెందిన జిల్లా భూసేకరణ అధికారి తాము డబ్బు ట్రాన్స్‌ఫర్ కోసం బ్యాంకుకు ఎలాంటి ఆర్టిజీఎస్ రిక్వెస్ట్ ఇవ్వలేదని ఇచ్చిన కంప్లెయింట్ మెుత్తం మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.