
- ఈ ఏడాది రాష్ట్రంలో నదీ బేసిన్లలో విభిన్న పరిస్థితులు
- గోదావరి కన్నా కృష్ణాకే ముందుగా వరద.. వేగంగా నిండుతున్న కృష్ణా ప్రాజెక్టులు
- జూరాలకు 1.22 లక్షలు, శ్రీశైలానికి 1.74 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- మూణ్నాలుగు రోజుల్లో శ్రీశైలం నిండి గేట్లు ఎత్తే చాన్స్
- గోదావరికి ఇంకా మొదలు కాని ఫ్లడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నదీ బేసిన్లలో ఈసారి విభిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడూ గోదావరి నదికి ముందుగా వరదలొస్తే.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కృష్ణా నదికి వస్తున్నది. కృష్ణా నదికి వరుసగా ఫ్లడ్ వస్తుండడంతో బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులు కళకళలాడుతుండగా.. సరైన వరదలేక గోదావరి నది మాత్రం వెలవెలబోతున్నది.ఎగువన కృష్ణా పరివాహకంలో మంచి వర్షాలుండడం.. గోదావరి క్యాచ్‌మెంట్ ఏరియాల్లో వర్షాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. అయితే, దిగువన ప్రాణహిత నుంచి వరద వస్తుండడంతో దిగువ గోదావరిలో మాత్రం 50 వేల క్యూసెక్కుల వరకు వరద కిందకు వెళ్తున్నది. నిరుడు ఇదే టైంతో పోలిస్తే.. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో మెరుగ్గా నీటి నిల్వలున్నాయి.
జూరాల, శ్రీశైలానికి వరద ప్రవాహం..
కృష్ణా ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నది. కర్నాటకలోని ఆల్మట్టికి 1.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. వచ్చిన వరదను వచ్చినట్టే కిందకు విడుస్తున్నారు. దీంతో జూరాలకు 1,21,773 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతున్నది. ప్రాజెక్టు నుంచి దిగువకు 1,22,523 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మరోవైపు తుంగభద్రకు 73 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. కిందకు 65 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతో ఇటు జూరాల, అటు తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వస్తున్నది. 1,74,455 క్యూసెక్కుల ఇన్ఫ్లోస్ఉన్నాయి. విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 67 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకుగానూ.. 175.1050 టీఎంసీలకు చేరుకున్నది. నిరుడు ఇదే టైమ్‌కు శ్రీశైలంలో కేవలం 37 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. వరద ప్రవాహం అదే నిలకడతో కొనసాగితే.. మరో మూణ్నాలుగు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండి.. ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక, శ్రీశైలం పవర్‌హౌస్ ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో నాగార్జునసాగర్ జలాశయానికి 56 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకుగానూ.. 155.92 టీఎంసీల నీళ్లున్నాయి.
గోదారికి ఇంకా మొదలు కాలే..
గోదావరి నదికి ఇంకా భారీ వరదలు మొదలు కాలేదు. దీంతో ప్రధాన జలాశయాలకు పెద్దగా జలసవ్వడి లేదు. మన రాష్ట్రంలోని క్యాచ్‌మెంట్ ఏరియాల్లో కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా వరద ప్రవాహాలు నమోదవుతున్నాయి. శ్రీరాంసాగర్‌కు 5,477 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోస్ ఉన్నాయి. అయితే, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు ఇంకా వరదలు మొదలు కాలేదు. గోదావరి బేసిన్లో భారీ వర్షాలు పడితే తప్ప.. వరదలు మొదలయ్యే పరిస్థితి లేదని అంటున్నారు. అయితే, జులై రెండో వారం నుంచి వరదలు మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
రేపటి నుంచి భారీ వర్షాలు
రాష్ట్రంలో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని వెల్లడించింది. సోమవారం నుంచి బుధవారం వరకు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. హైదరాబాద్ నగరంలోనూ 4 రోజులపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉదయం పొగమంచు ప్రభావం ఉంటుందని పేర్కొన్నది. అన్ని జిల్లాలకూ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.