సవాళ్లకు రాని సారు!.. మౌనం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్

సవాళ్లకు రాని సారు!.. మౌనం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్
  • చర్చకు అసెంబ్లీకి రమ్మంటే.. ఫామ్​హౌస్​కే పరిమితం
  • అన్నింటికీ కేటీఆర్ లేదంటే హరీశ్​రావు ముందటికి
  • పదేండ్లు సీఎంగా నీళ్లపై విధాన నిర్ణయాలన్నీ కేసీఆర్​వే
  • కాళేశ్వరం నిర్మాణం, ఏపీకి నీటి వాటాలూ ఆయన హయాంలోనే
  • వాటిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిద్దామని సీఎం రేవంత్​ సవాళ్లు
  • ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమంపైనా తేల్చుకుందామని తాజాగా చాలెంజ్​
  • స్పందించని అపోజిషన్​ లీడర్.. పార్టీ మీటింగ్స్​లో 
  • మాత్రం ‘ఇగ యుద్ధమే’నంటూ ప్రకటనలు
  • చర్చకు కేసీఆర్​ అక్కర్లేదని, తాను వస్తానంటూ కేటీఆర్​ రియాక్షన్​
  • ప్రతిపక్ష నేతకు సవాల్​ చేస్తే.. 
  • కేటీఆర్​ స్పందించడంపై కాంగ్రెస్​ నేతల ఫైర్​

హైదరాబాద్​, వెలుగు: పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్​.. ప్రతిపక్ష నేతగా మాత్రం నోరు మెదపడం లేదు. ఆయన హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై చర్చిద్దామని కాంగ్రెస్​ నేతలు చాలెంజ్​ చేస్తున్నా  స్పందించడం లేదు. ముఖ్యంగా నీళ్ల విషయంలో సీఎం రేవంత్​రెడ్డి వరుసగా సవాళ్లు​ విసురుతున్నా అపోజిషన్​ లీడర్​ కేసీఆర్​ బయటకు రావడం లేదు.. బదులు ఇవ్వడం లేదు. కృష్ణా జలాల్లో తక్కువ వాటాకు ఒప్పుకోవడంతోపాటు ఏపీ బనకచర్ల కుట్రలకు కారణం కేసీఆరే అని సీఎం రేవంత్​, అధికారపక్ష నేతలు మండిపడుతున్నారు. అసెంబ్లీకి వస్తే సమగ్రంగా చర్చిద్దామంటున్నారు. ఉద్యోగాల భర్తీ, రైతుల సంక్షేమంపై కూడా చర్చిద్దామని సవాల్​ చేస్తున్నా..  కేసీఆర్​ మాత్రం ఫామ్​హౌస్​ వీడటం లేదు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకట్రెండు సార్లు మినహా  అసెంబ్లీకి కేసీఆర్​ వచ్చిన దాఖలాలు లేవు. కీలకమైన చర్చల్లో పాల్గొన్నదీ లేదు. 

హుందాతనం తగ్గిపోతదట!

సీఎం రేవంత్​.. కేసీఆర్​కు సవాళ్లు విసిరితే ప్రతిపక్ష నేతగా ఆయన నుంచి కనీస స్పందన రాకపోవడం ఏమిటని ఇతర పార్టీల నేతలతోపాటు బీఆర్​ఎస్ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు బదులు కేటీఆర్​ లేదంటే హరీశ్​రావు ముందుకు వస్తున్నారు. కేసీఆర్ స్థాయికి రేవంత్​ సరితూగరని, కేసీఆర్​ అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే  హుందాతనం తగ్గిపోతుందంటూ వాదిస్తున్నారు.  నీళ్లతోపాటు ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్​కు తాజాగా సీఎం రేవంత్​ సవాల్​ విసరగా.. దానికి కూడా ప్రతిపక్ష నేత నుంచి స్పందన లేదు. ఎప్పటిలాగే ఆయనకు బదులు  కేటీఆర్​ మీడియా ముందుకు వచ్చారు. 

సీఎం​ సవాల్​కు కేసీఆర్​ రావాల్సిన పనిలేదని, సోమాజిగూడ​ ప్రెస్​క్లబ్​లో చర్చిద్దామంటూ కేటీఆర్​ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్​, సీతక్క ఫైర్​అయ్యారు. సీఎం రేవంత్​.. ప్రతిపక్ష నాయ కుడైన కేసీఆర్​కు సవాల్​ విసిరితే మధ్యలో కేటీఆర్​ 
మాట్లాడడం ఎందుకంటూ చురకలు అంటించారు. 

అన్నీ కేసీఆర్​ హయాంలోనే..

కాళేశ్వరం నిర్మాణం, గోదావరి జలాల మళ్లింపు లాంటి నిర్ణయాలన్నీ కేసీఆర్​ సీఎంగా ఉన్న కాలంలోనే జరిగిపోయాయి. కృష్ణా జలాల్లో ఏపీకి ఎక్కువ వాటా దక్కడమూ కేసీఆర్​ కార్యమే. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల వాటాలకు సంతకాలు పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టారనే విమర్శలను ఆయన​ఎదుర్కొంటున్నారు.  ఆనాడు జరిగిన వాటాల పంపిణీని అడ్డుపెట్టుకొని ఇప్పుడు ట్రిబ్యునల్​లోనూ మన వాటా నీళ్లు మనకు దక్కకుండా ఏపీ కుట్రలు చేస్తున్నది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టును గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్​ కోసమంటూ కేవలం మూడేండ్లలోనే పూర్తి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి.

ఈ క్రమంలో క్వాలిటీ పాటిస్తున్నారా.. సరైన లొకేషన్లా కాదా.. అన్నది చూడకుండానే కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి వదిలేయడంతో నాలుగేండ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. ఫలితంగా లక్ష కోట్ల ప్రాజెక్టు ఎందుకూ పనికిరాకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఏపీ చేపట్టిన పోలవరం– బనకచర్ల లింక్  ప్రాజెక్టుకు కేసీఆర్ ​హయాంలోనే బీజం పడింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే గోదావరిలో మిగులు జలాలు చాలా ఉన్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలు నీటిని వాడుకోవచ్చని అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​లో కేసీఆర్​ చెప్పారు. రాయలసీమకు నీళ్లను తీసుకెళ్లొచ్చని క్లూ కూడా ఇచ్చా రు. ఆయన నోటిపుణ్యమా అని విభజిత ఏపీ తొలి సీఎం చంద్రబాబు నాయుడు.. రాయలసీమకు నీళ్లం దించేందుకు గోదావరి–సోమశిల (పెన్నా) నదుల అను సంధానాన్ని ముంగటేసుకున్నారు. ఆ తర్వాత అది ఆగిపోయినా.. ఏపీ రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్​తో ప్రగతిభవన్​లో మీటింగ్​ పెట్టుకున్న కేసీఆర్​ రాయలసీమకు నీళ్లను తీసుకెళ్లేందుకు ఓకే చెప్పారు. నాడు రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​ కడుతున్నా నోరు మెదపలేదనే ఆరోపణలున్నాయి. తీరా టెండర్లు ముగిసి.. పనులు మొదలుపెట్టాక హడావిడి చేశారు. ఏపీలో నాటి మంత్రి రోజ ఇంటికెళ్లి గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తామంటూ సీఎం హోదాలో కేసీఆర్​ మాట ఇచ్చి వచ్చారు. 

‘ఇగ బైలెళ్త’ అని చెప్పి.. రెండునెలలాయె!

సీఎంగా కేసీఆర్​ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి శాపంలా మారాయని, ప్రస్తుత సమస్యలన్నింటికీ మూలా లు ఆయన దగ్గరే ఉన్నాయని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు. తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని, కేసీఆర్ చర్చకు వస్తే చూపుతామని సవాల్​ విసురుతున్నా.. ఆయన నుంచి  స్పందన రావడం లేదు. ఏపీ చేపడుతు న్న బనకచర్ల ప్రాజెక్టు కేసీఆర్​పాపమే అని సీఎం రేవంత్​ అంటున్నా..  ఖండనగా కేసీఆర్​నుంచి ఒక్క ప్రకట న కూడా రాలేదు. దీంతో అసలు కేసీఆర్​ బనకచర్లకు వ్యతిరేకమా? కాదా? అన్నది బీఆర్​ఎస్​ నేతలకు కూడా అంతుచిక్కని పరిస్థితి. తాజాగా కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దాం రావాలంటూ సీఎం రేవంత్​ సవాల్​ విసిరినా..  కేసీఆర్​ మౌనాన్నే ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏప్రిల్​ 27న నిర్వహించిన బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో.. “కాంగ్రెస్​ ప్రభుత్వానికి ఏడాదిన్నర టైమిచ్చిన. ఇగ ఊకోను. జనం కోసం బైలెళ్త. ఎవనిలెక్కేందో తీస్త”అంటూ మాట్లాడిన కేసీఆర్​.. ఆ తర్వాత ఫామ్​హౌస్​కే పరిమితమయ్యారు. బీఆర్​ఎస్​ శ్రేణులు.. నిజంగానే తమ చీఫ్​ బయటకు వస్తారని భావించారు. కానీ, రెండు నెలలవుతున్నా ఆయన బయటకు రాకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.