కాగజ్ నగర్, వెలుగు: బెజ్జూరు మండల కేంద్రంలోని ఏలేశ్వరం బంగారం నగల షాపులో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు రాత్రి షాపు వెనక వైపు రేకులను తొలగించి షాపులోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. బెజ్జూరు మండల కేంద్రంలో షాపులకు శనివారం సెలవు కావడంతో షాపులను తీయలేదు.
ఆదివారం ఉదయం ఏలేశ్వరం బంగారు దుకాణం యజమాని నరేశ్ షాపు తెరిచి చూడగా 800 గ్రాముల వెండి కాళ్ల పట్టీలు, 200 గ్రాముల వెండి వస్తువులు చోరీ అయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సుమారు లక్ష రూపాయలు నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి ఎస్సై సర్తాజ్ పాషా వచ్చి సీసీ పుటేజీ పరిశీలించారు. కౌటాల సీఐ సంతోశ్ కుమార్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ని రప్పించి తనిఖీ చేశారు కేసు దర్యాప్తులో ఉంది.
