
- రోడ్డు విస్తరణ, అభివృద్ధి పేరుతో కొన్ని పాత స్టాప్‌లు తొలగింపు
- షాపుల ఓనర్ల అభ్యంతరాలతో మరికొన్నిచోట్ల తీసేశారు..
- అక్కరలేని ఏరియాల్లో కొన్ని ఏర్పాటు
- జీడబ్ల్యూఎంసీ, ఆర్టీసీ ఆఫీసర్ల మధ్య సమన్వయలోపం
- ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
ఇది కాకతీయ యూనివర్సిటీ జంక్షన్. ఇక్కడ వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికుల వెయిట్ చేస్తుంటారు. గతంలో ఇదేచోట బస్టాప్ ఉండేది. కానీ, కొందరు ప్రైవేట్ షాపుల యజమానులకు మేలు చేసేందుకు దాన్ని ఎత్తేశారు. దీంతో ఇక్కడ బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నారు. ఎర్రగట్టు గుట్ట, హనుమకొండ చౌరస్తా, ములుగు రోడ్డు తదితర జంక్షన్లలోనూ బస్టాప్ లు లేకపోవడం వల్ల నానాతంటాలు పడుతున్నారు.
హనుమకొండ, వెలుగు: గ్రేటర్వరంగల్ నగరంలో ఆర్టీసీ, జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్ల మధ్య సమన్వయలోపం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వారికోసం బస్టాప్ లు ఏర్పాటు చేయాల్సిన ఉండగా కొన్నిచోట్ల పాత వాటిని తొలగించారు. మరికొన్నింటిని జనాలకు ఉపయోగపడని చోట ఏర్పాటు చేశారు. ఫలితంగా బస్సుల్లో రాకపోకలు సాగించే లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడా సరైన ఏర్పాట్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
86 చోట్ల కొత్త బస్ బేలు
వరంగల్, హనుమకొండ బస్టాండ్ల నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు వివిధ రూట్ లలో ఆర్టీసీ బస్సులు నడిపిస్తుండగా.. ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు నిత్యం 2 లక్షల మంది వరకు వాటిని వినియోగించుకుంటున్నారు. గతంలో ప్రయాణికుల సౌకర్యార్థం నగరంలో 126 చోట్ల బస్టాప్ లు ఏర్పాటు చేశారు. వాటి అప్ గ్రేడ్ పేరుతో జీడబ్ల్యూఎంసీ ఆర్టీసీ కోఆర్డినేషన్ తో సిటీ వ్యాప్తంగా ఒక్కోదానికి రూ.2 లక్షల చొప్పున ఖర్చు చేసి, 86 చోట్ల కొత్త బస్ బేలు ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆఫీసర్ల ప్లానింగ్ లోపం వల్ల కొన్నిచోట్ల పాత బస్టాప్‌లు ఎత్తేశారు.
రోడ్డు విస్తరణ, ఇతర డెవలప్ మెంట్ పనుల పేరుతో కొన్నిచోట్ల తొలగించగా.. స్థానిక షాపుల ఓనర్ల అభ్యంతరాల నేపథ్యంలో మరికొన్నిచోట్ల తీసేశారు. వరంగల్ రింగ్ రోడ్డు సమీపంలోని చింతగట్టు క్యాంప్ వద్ద పెట్రోల్ బంక్ పక్కనే బస్టాప్ ఉండేది. దీన్ని కొన్ని రోజుల కింద వరంగల్–-కరీంనగర్ హైవేపై ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ పక్కకు మార్చారు. కెనాల్ ముందే బస్సులు ఆపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రయాణికులు బస్టాప్ ను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. హసన్ పర్తి మండల కేంద్రంలోని బస్టాప్ ను అధికారులే ప్రైవేట్షాపులకు అప్పగించడంతో ప్రయాణికులకు రోడ్డే దిక్కవుతోంది.
ఉన్నవీ తొలగించిన్రు
గతంలో హనుమకొండ చౌరస్తాలోని అమృత థియేటర్ సమీపంలో బస్ బే ఉండేది. అభ్యంతరాలను సాకుగా చూపి, దాన్ని తొలగించారు. దీంతో ఇక్కడ బస్సులెక్కే స్టూడెంట్లు, ప్రజలు నీడ కోసం తండ్లాడుతున్నారు. కరీంనగర్–వరంగల్ రూట్ లో ఎర్రగట్టు గుట్ట జంక్షన్ వద్ద ఉండే బస్టాప్ ను రోడ్డు విస్తరణ పేరుతో తొలగించారు. ఇదే జంక్షన్ వద్ద వరంగల్–కరీంనగర్ రూట్ లో కూడా బస్టాప్ లేదు. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం రోడ్ల మీదే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ములుగు–వరంగల్ రూట్ లో గ్రేటర్ మూడో డివిజన్ పరిధి ఆరెపల్లి వద్ద బస్టాప్ తొలగించడంతో అక్కడ బస్సులు ఆగడం లేదు.
నాలుగు రోజుల కింద గ్రామస్తులందరూ రాస్తారోకో నిర్వహించారు. బస్టాప్ ను పునరుద్ధరించి, ఆర్టీసీ బస్సులు ఆపాలని డిమాండ్‌చేశారు. అవసరమైన చోట బస్టాప్‌లు లేకపోవడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులతోపాటు మహాలక్ష్మి స్కీం వినియోగించుకుంటున్న మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గోపాలపూర్ క్రాస్, అలంకార్ జంక్షన్ వంటి ఏరియాల్లో ప్రజలు ఉంటున్నా బస్టాప్ లు లేకపోవడం సమస్యగా మారింది. ఆర్టీసీ అధికారులు స్పందించి, ప్రయాణ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
అవసరమైనచోట ఏర్పాటు చేస్తం
వరంగల్ నగరంలో ఇదివరకు గుర్తించిన చోట బస్ బేలు ఏర్పాటు చేశాం. ఆల్రెడీ సర్వే చేసి, బస్టాప్‌లు అవసరమైన 40 ఏరియాలను గుర్తించాం. ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపి, బస్ బేలు ఏర్పాటు చేస్తం. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. - డి.విజయభాను, ఆర్టీసీ ఆర్ఎం, వరంగల్ రీజియన్