- డార్క్ ప్యాటర్నులతో జాగ్రత్త
- డ్రిప్ప్రైసింగ్తో కంపెనీల మోసాలు
- హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- ఫిర్యాదుకు ప్రత్యేక హెల్ప్‌లైన్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన నిరంజన్ ఒక ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా బిర్యానీ కోసం వెతికాడు. ధర రూ.200 కనిపించడంతో మంచి ఆఫర్ అనుకున్నాడు. పేమెంట్ పేజీకి వెళ్లాక రూ.280 చూపించడంతో షాకయ్యాడు. ప్లాట్‌ఫారమ్ ఫీజు, డెలివరీ ఫీజు, డొనేషన్ వంటివి చేర్చడంతో మొత్తం బిల్లు అమాంతం పెరిగింది. చాలా ఈ–-కామర్స్ ప్లాట్‌ఫారాలు ఇలా చేస్తుండటంతో కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ఇందుకోసం డ్రిప్ ప్రైసింగ్వంటి డార్క్ ప్యాటర్న్ పద్ధతులను వాడుతున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది.
కొనేటప్పుడు తక్కువ ధరను చూపుతూ.. పేమెంట్ చేసే సమయంలో ధరను పెంచిచూపడాన్ని డ్రిప్ ప్రైసింగ్అంటారు. డిస్కౌంట్ ఉన్నప్పటికీ, ఈ డ్రిప్ ప్రైసింగ్ విధానం ఫైనల్ బిల్లును పెంచుతుంది. డీల్ చాలా బాగున్నట్లు అనిపిస్తుంది కానీ చివరిలో చూపించే చార్జీలు ధరను పెంచుతాయి. కొన్ని సంస్థలు జీఎస్టీని తగ్గించామని చెబుతాయి కానీ పాత మొత్తాన్నే వసూలు చేస్తాయి. ఫ్రీ డెలివరీ అంటూ ఊరిస్తూనే చివరికి ఆ చార్జీనీ వసూలు చేస్తాయి. డార్క్ప్యాటర్న్లపై 1915 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు.
ఇలా దోచేస్తారు..
ఒక ప్రొడక్టును కొనుగోలు చేసేటప్పుడు, అదనపు సేవలు లేదా వస్తువుల (ఉదాహరణకు, ప్రయాణ బీమా, డొనేషన్, ఎక్స్ట్రా వారంటీ) కోసం బాక్సులు డిఫాల్ట్‌గా టిక్ అయి ఉంటాయి. గమనించకుండా చెకౌట్ చేస్తే, జేబుపై అదనపు భారం పడుతుంది. ఫ్రీ ట్రయల్పేరుతోనూ అదనంగా వసూలు చేస్తారు. కంపెనీ ఏదైనా సబ్స్క్రిప్షన్కోసం ఫ్రీ ట్రయల్‌ను అందిస్తూనే, మీ క్రెడిట్‌కార్డు వివరాలు ఇవ్వాలని అడుగుతారు. ట్రయల్ ముగిసిన తర్వాత, రిమైండర్ లేకుండానే పూర్తి-స్థాయి సబ్‌స్క్రిప్షన్‌గా మారుతుంది. దీంతో ప్రతి నెలా కార్డు నుంచి డబ్బులు కట్అవుతాయి. క్రెడిట్ కార్డ్ లేదా డిజిటల్ వాలెట్ వంటి వాటితో చెల్లిస్తే , చివరిలో అదనంగా కన్వీనియన్స్ ఫీజు లేదా ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. డెలివరీ, టికెట్, బుకింగ్ వంటివి కొనేటప్పుడు టిప్‌ను కూడా ఫైనల్బిల్లుకు కలుపుతాయి.
డార్క్ ప్యాటర్న్ అంటే...
ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో యూజర్లను మోసం చేయడానికి లేదా వారు కోరని పనులు చేసేలా చేయడానికి రూపొందించిన మోసపూరిత డిజైన్ పద్ధతులనే డార్క్ప్యాటర్న్స్అంటారు. ఈ ట్రిక్స్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని, వినియోగదారులకు తెలియకుండానే కంపెనీలకు లాభం చేకూరుస్తాయి.
