పగటిపూట వాడితే.. 20% తక్కువ కరెంట్ బిల్లు

పగటిపూట వాడితే.. 20% తక్కువ కరెంట్ బిల్లు
  • రాత్రిపూట పీక్ టైమ్​లో అయితే.. 10% --20% ఎక్కువైతది
  • 2020 విద్యుత్ రూల్స్ ను సవరించిన కేంద్రం 
  • టైమ్ ఆఫ్ డే (టీఓడీ) టారిఫ్ అమలుకు నిర్ణయం 
  • రెండేండ్లలో అందరికీ అమలు.. రైతులకు మాత్రం మినహాయింపు  

హైదరాబాద్‌‌, వెలుగు: కరెంట్ ను వాడుకునే టైమ్‌‌ను బట్టి వినియోగదారులకు చార్జీల్లో ప్రయోజనం కల్పించేలా విద్యుత్ చార్జీల రూల్స్ లో కేంద్రం మార్పులు తీసుకువచ్చింది. ప్రస్తుత విద్యుత్ టారిఫ్ వ్యవస్థకు రెండు మార్పులు చేసినట్లు ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. గత 2020 విద్యుత్‌‌ నిబంధనల్లో టైమ్ ఆఫ్ డే (టీఓడీ) టారిఫ్‌‌, స్మార్ట్ మీటరింగ్ కు సంబంధించి నిబంధనలను సవరించినట్లు వెల్లడించింది.

డిమాండ్‌‌ను బట్టి కరెంటును వాడేందుకు వీలుగా టైమ్‌‌ ఆఫ్‌‌ డే (టీఓడీ) టారిఫ్‌‌ సిస్టమ్ ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ సిస్టమ్‌‌ ద్వారా పగటి పూట కరెంటు వాడే వినియోగదారులకు తక్కువ చార్జీలు వర్తిస్తాయి. దీంతో బిల్లు 20 శాతం వరకు తగ్గనుంది. డిమాండ్ ఎక్కువగా ఉండే రాత్రి వేళల్లో కరెంటు వాడితే చార్జీలు సాధారణం కంటే10 నుంచి 20 శాతం మేర పెరుగుతాయని కేంద్ర విద్యుత్‌‌ శాఖ  మంత్రి ఆర్‌‌కే సింగ్‌‌ వెల్లడించారు. వినియోగదారులు ఏ సమయంలో ఎంత కరెంటు వాడుతున్నారనేది స్మార్ట్‌‌ మీటర్లతో గుర్తించి దాని ప్రకారం కరెంటు బిల్లులు ఇవ్వనున్నట్లు తెలిపారు. స్మార్ట్ మీటర్ వినియోగదారులకు కొత్త టారిఫ్ త్వరలోనే అమలులోకి రానుందని ఆయన ప్రకటించారు. 

రెండేండ్లలో అందరికీ అమలు 

మార్చిన విద్యుత్‌‌ నిబంధనలను వచ్చే రెండేండ్లలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిబంధనల ప్రకారం10 కిలోవాట్‌‌, అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉన్న కమర్షియల్‌‌, ఇండస్ట్రియల్‌‌ విద్యుత్‌‌ వినియోగదారులకు ఏప్రిల్‌‌1, 2024 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ వినియోగదారులకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతర వినియోగదారులకు ఏప్రిల్‌‌1, 2025 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయని కేంద్ర విద్యుత్‌‌ శాఖ వెల్లడించింది.  

టైమ్ మార్చుకుంటే లాభం 

విద్యుత్‌‌ డిమాండ్ తక్కువగా ఉన్న టైమ్‌‌లో ఎక్కువ కరెంటును వాడుకునేలా ఈ కొత్త విధానం ద్వారా వినియోగదారులను ప్రోత్సహించనున్నారు. ఫలితంగా గ్రిడ్‌‌లపై భారం తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఉదయం వేళ సోలార్‌‌ పవర్‌‌ అందుబాటులో ఉండనున్న నేపథ్యంలో దాని ధర తక్కువ.. కరెంటు ఎక్కువ ఉంటుంది. అందుకే ఉదయం వేళలను సోలార్‌‌ అవర్స్‌‌గా పేర్కొంటూ ఆ టైమ్‌‌లో కరెంటు వాడుకునే కస్టమర్లకు విద్యుత్‌‌ చార్జీలు తక్కువ వసూలు చేయనున్నారు. రాత్రి వేళ హైడ్రో, థర్మల్‌‌ తదితర విద్యుత్‌‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. వీటి నిర్వహణ ఖరీదుతో  కూడుకున్నది. అందుకే రాత్రి వేళల్లో వాడుకునే విద్యుత్‌‌ చార్జీల ధరలను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో కరెంటు వాడకాన్ని సోలార్‌‌ హవర్స్‌‌కు మార్చుకునే కస్టమర్లకు లబ్ధి చేకూరనుంది.  

స్మార్ట్‌‌ మీటర్లకు ప్రోత్సాహం 

దేశవ్యాప్తంగా కరెంట్ వాడకాన్ని కచ్చితత్వంతో లెక్కించేందుకు స్మార్ట్‌‌ మీటర్ నిబంధనల్లోనూ మార్పులు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. స్మార్ట్‌‌ మీటర్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేయడానికి ముందు వరకు వినియోగించిన కరెంటుపై ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని తెలిపింది. స్మార్ట్‌‌ మీటర్‌‌ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. 

భారీగా పెరగనున్న డిమాండ్‌‌  

గ్లోబల్‌‌ వార్మింగ్‌‌ నేపథ్యంలో వాతావరణంలో మార్పుల కారణంగా ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో దేశవ్యాప్తంగా కరెంటు వాడకం గణనీయంగా పెరిగింది. రాబోయే నాలుగేండ్లలో వినియోగం రెట్టింపు అవుతుందని కేంద్ర విద్యుత్‌‌ శాఖ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా మార్చి 2022 నాటికి కరెంట్ డిమాండ్ 4 శాతం ఉండగా.. మార్చి 2027 నాటికి ఇది సుమారు 7.2 శాతానికి చేరుకుంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త విద్యుత్‌‌ చార్జీల రూల్స్ అమలు చేయడం ద్వారా గ్రిడ్‌‌లపై భారాన్ని తగ్గించవచ్చని సర్కారు భావిస్తోంది.