సేఫ్టీ, సెక్యూరిటీకి మాదే బాధ్యత.. కశ్మీరీలకు కేంద్రం భరోసా

సేఫ్టీ, సెక్యూరిటీకి మాదే బాధ్యత.. కశ్మీరీలకు కేంద్రం భరోసా

షోపియాన్​లో ఎన్​ఎస్​ఏ అజిత్​​ ధోవల్​ పర్యటన
స్థానికులతో ముచ్చట్లు, రోడ్డు పక్కనే లంచ్

శ్రీనగర్​: ‘‘అల్లాహ్​ దయతో ఇకపై అంతా మంచే జరుగుతుంది. సేఫ్టీ, సెక్యూరిటీకి మాదే బాధ్యత. మీ పిల్లలు, వాళ్ల తర్వాతి తరాల వాళ్లూ ఇక్కడే ప్రశాంతంగా లైఫ్ లీడ్​ చేస్తూ, ప్రంపంచంలో తమకంటూ గొప్ప పేరు తెచ్చుకుంటారు..”అంటూ కాశ్మీరీలకు భరోసా ఇచ్చారు నేషనల్​ సెక్యూరిటీ అడ్వైజర్​ అజిత్​ ధోవల్. పాకిస్థాన్​ సరిహద్దుకు దగ్గరగా ఉండే దక్షిణ కాశ్మీర్​లో బుధవారం ఆయన పర్యటించారు. షోఫియాన్​ జిల్లా కేంద్రంలో స్థానికులతో మాట్లాడారు. ఆర్టికల్​ 370 రద్దు, రాష్ట్ర విభజనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, కొద్ది రోజుల్లోనే పరిస్థితులు చక్కబడతాయని అన్నారు. ఎవరెవరు ఏమేం పనులు చేస్తారో, వాళ్ల జీవితాలెలా గడుస్తున్నాయో  దోవల్​ ఒక్కొకర్నీ అడిగి తెలుసుకున్నారు. ఉద్రిక్తత తగ్గిన వెంటనే షాపులు ఓపెన్​ చేసుకోవచ్చని తెలిపారు. ఈలోపే కాశ్మీరీ సంప్రదాయ వంటకం ‘వజ్వాన్’ రెడీ కావడంతో అక్కడున్నవాళ్లతో కలిసి ధోవల్​ రోడ్డు పక్కనే లంచ్​ చేశారు.

కాశ్మీర్​ పోలీసులు గ్రేట్​

దక్షిణ కాశ్మీర్​ పర్యటనలో భాగంగా సీఆర్పీఎఫ్​, జమ్మూకాశ్మీర్​ పోలీస్​ టీమ్​లతోనూ అజిత్​ ధోవల్ మాట్లాడారు. ఎక్కడ, ఎలాంటి సమస్య వచ్చినా డీల్​ చేసేది సీఆర్​పీఎఫ్​ బలగాలేనని, ఆ రకంగా దేశసేవలో ముందుంటారని గుర్తుచేశారు. లోకల్​ పోలీసులతో ముచ్చటిస్తూ.. ‘‘ప్రజల కోసం మీరు ప్రాణాలకు తెగించి పోరాడుతారు. చాలా సార్లు మన త్యాగాలకు గుర్తింపు కూడా దొరకదు. తీవ్రవైన ఒత్తిళ్లు ఉన్నా డ్యూటీ విషయంలో కమిట్​మెంట్​ చూపిస్తారు. అందుకే మీరంటే నాకు చాలా గౌరవం. జమ్మూకాశ్మీర్ పోలీసులు నిజంగా గ్రేట్​. దేశంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది’’అని ధోవల్ అన్నారు. మంగళవారం లోక్​సభలో కాశ్మీర్​ విభజన బిల్లు పాసైన కొద్దిసేపటికే కాశ్మీర్​లో ప్రత్యక్షమైన అజిత్​ ధోవల్​..  కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్​(సీబీఎం)లో భాగంగా స్థానికులతో మమేకమయ్యారు.