ఆరేండ్లలో మన రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు ₹ 1.55 లక్షల కోట్లు

ఆరేండ్లలో మన రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు  ₹ 1.55 లక్షల కోట్లు

లోక్​సభలో చెప్పిన ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మల

2014 నుంచి రాష్ట్ర అప్పులు పెరిగిపోతున్నయని వెల్లడి

ఎంపీ కోమటిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం

హైదరాబాద్, వెలుగుగత ఆరేండ్లలో తెలంగాణకు రూ.1.55 లక్షల కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర పన్నుల వాటాతోపాటు గ్రాంట్లు, సెంట్రల్​ స్పాన్సర్డ్ స్కీములకు ఇచ్చిన నిధుల వివరాలను విడివిడిగా ప్రకటించింది. లోక్‌సభలో కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. 2014లో తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రమని, తర్వాత క్రమంగా అప్పులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర జీఎస్డీపీ, రుణాల నిష్పత్తి ద్రవ్య నియమాలకు లోబడే ఉన్నాయని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు ఆరేండ్లలో ఫైనాన్స్ కమిషన్​ సిఫార్సుల ప్రకారం పన్నుల వాటా కింద రూ.85,013 కోట్లు, స్థానిక సంస్థల గ్రాంట్లు రూ.8,463.83 కోట్లు, విపత్తు నిధి కింద రూ.2,162.31 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. వెనుకబడిన జిల్లాలకు రూ.1,916 కోట్ల స్పెషల్​ గ్రాంట్, ఇతర గ్రాంట్ల ద్వారా రూ.917 కోట్లు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్​లకు రూ.57,036 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఇందులో కేంద్ర పథకాలకు సంబంధించిన గ్రాంట్లను శాఖల వారీగా వెల్లడించారు. రూరల్​ డెవెలప్​మెంట్, స్కూల్​ ఎడ్యుకేషన్, అర్బన్​ డెవలప్​మెంట్, డ్రింకింగ్​ వాటర్​ అండ్​ శానిటేషన్, హెల్త్ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్​కు ఎక్కువ నిధులు ఇచ్చినట్టు వివరించారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి