14పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం

14పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం
  • 14 పంటలకు ఎంఎస్‌‌‌‌పీ పెంచుతూ కేంద్రం నిర్ణయం
  • వరికి రూ. 100.. పత్తికి రూ. 355 పెంపు 
  • అత్యధికంగా నువ్వులకు రూ. 523, పెసర్లకు 480
  • జొన్నలకు రూ. 232, రాగులకు రూ. 201, 
  • మినుములకు రూ. 300 పెంపు
  • మక్కలకు రూ. 92 పెరిగిన ధర 
  • ప్రధాని ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ ఆమోదం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రైతులకు కేంద్రం ఖుషీ ఖబర్‌‌‌‌ తెలిపింది. ప్రస్తుత వానాకాలం సీజన్ (2022–23)లో ఆయా పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌‌‌‌పీ)లను పెంచుతూ మోడీ సర్కార్‌‌‌‌ నిర్ణయం తీసుకుంది.  బుధవారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్​ కమిటీ (సీసీఈఈ)’.. ఖరీఫ్ లో సాగయ్యే 14 రకాల పంటలకు మద్దతు ధరల పెంపుదలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ కమిటీ మీటింగ్ తర్వాత కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ పెంచిన ఎంఎస్‌‌‌‌పీ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎంఎస్‌‌‌‌పీ పెరుగుదలతో రాష్ట్రంలో వరి, పత్తి, కంది, నువ్వులు, వేరుశనగ వంటి పంటలను సాగు చేసే రైతులు గణనీయంగా లబ్ధి పొందనున్నారు. 

వరికి వంద  

వడ్లకు ఎంఎస్​పీ క్వింటాల్‌‌‌‌కు రూ.100 పెరిగింది. నిరుడు వరి ఏ గ్రేడ్‌‌‌‌ క్వింటాల్​కు రూ.1,960 ఉండ గా, తాజాగా అది రూ.2,060కి పెరిగింది. బీ గ్రేడ్‌‌‌‌ ధాన్యం క్వింటాల్‌‌‌‌ ధర నిరుడు రూ.1,940 ఉండగా ఈ యేడు రూ.2,040కి పెరిగింది. క్వింటాల్‌‌‌‌ వడ్లు పండించడానికి రూ.1,360 ఖర్చు అవుతుందని నిర్ధారించిన కేంద్రం.. దానికి 50% అదనంగా ఎంఎస్‌‌‌‌పీని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో రెండు సీజన్‌లలో అత్యధికంగా పండించే వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లభించినట్లయింది. 

ఆయిల్‌ సీడ్స్‌, పప్పులకు భారీగా 

ఈ యేడు నూనె గింజలు, పప్పుధాన్యాల పంటలకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. నూనెలు, పప్పుల కొరత ఉన్నందున రైతులు ఈ పంటలు వేసేలా ప్రోత్సహించేందుకు మద్దతు ధర భారీగా పెంచింది. నువ్వులకు అత్యధికంగా రూ.523 పెంచింది. వేరుశనగకు రూ.300 ఎంఎస్‌పీ పెరిగింది. పొద్దు తిరుగుడుకు రూ.385, సోయాకు రూ.350 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  సోయాకు నిరుడు పెంచిన దానికి కంటే నాలుగు రెట్లు అధికంగా ధర పెరిగింది. రాష్ట్రంలో నువ్వుల సాగు తక్కువే కానీ అయిల్‌ సీడ్స్‌కు ధర పెంచడంతో నూనెగింజల సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పప్పుల్లో పెసర పప్పుకు అధికంగా ధర పెంచింది. పెసళ్లకు నిరుటి కంటే  ఆరు రెట్లు అధికంగా క్వింటాల్‌కు రూ.480 పెరిగింది. కంది, మినప పప్పులకు రూ.300 చొప్పున మద్దతు ధర పెరిగింది. 

సాగు ఖర్చు కంటే 50% అధికంగా 

పంటల ఉత్పత్తికయ్యే ఖర్చును బట్టి.. దాని కంటే కనిష్టంగా 50 శాతం, గరిష్టంగా 85 శాతం మేరకు ఎంఎస్‌పీలను కేంద్రం నిర్ణయించింది. సాగు ఖర్చుతో పోలిస్తే.. అత్యధికంగా సజ్జలకు 85 శాతం, కందులకు 60 శాతం, మినుములకు 59 శాతం, పొద్దుతిరుగుడుకు 56 శాతం, వేరుశనగకు 51 శాతం,  మిగతా పంటలకు 50 శాతం పెంచి ఎంఎస్‌పీని ఖరారు చేసింది. రాగులు, పెసర్లు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయా, నల్ల, తెల్ల నువ్వులు, పత్తి పంటలకూ ఉత్పత్తి వ్యయం కంటే అధికంగా మద్దతు ధరలు కల్పించింది.  

పత్తి రైతులకు మేలు 

ఈ సారి పత్తి సాగును 75 లక్షల నుంచి 80 లక్షల ఎకరాలకు పెంచాలనుకోవడంతో ఆ మేరకు ప్రోత్సాహం ఉండేలా మద్దతు ధరలు కూడా పెరిగాయి. పొడుగు రకం పత్తికి రూ.353, సాధారణ రకం పత్తికి రూ.354 చొప్పున మద్దతు ధర పెంచడంతో పత్తి రైతులకు అదనపు ప్రయోజనం చేకూరినట్లయింది. నిరుడు రెండు రకాల పత్తి మద్దతు ధరలు రూ.6,025, రూ.5,726 చొప్పున ఉండగా ఈ యేడు రూ.6,080, రూ.6,380కి పెరిగాయి. పత్తికి ఈ యేడు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ పలికింది. దీంతో కాటన్‌ కార్పొరేషన్‌ కొనే అవసరం రాలేదు. తాజాగా పెంచిన ధర తో వచ్చే సీజన్‌లో రైతులకు భారీగా మేలు చేకూరనుంది.  

మక్కలకే తక్కువ   

కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలలో మక్క పంటకే అన్నింటి కంటే తక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది. నిరుడు మక్కలకు క్వింటాల్‌ రూ.1,870 మద్దతు ధర ఉండగా ఈ యేడు దాన్ని రూ.1,962గా నిర్ధారించారు. అంటే నిరుడుతో పోలిస్తే రూ.92 మాత్రమే పెరిగింది. అయితే, క్వింటాల్ మక్కల సాగుకు రూ. 1,308 ఖర్చు అవుతుందని నిర్ధారించినందున.. దాని కంటే 50 శాతం ఎక్కువగానే మద్దతు ధర లభించింది. 

ఎన్ఎస్ఐఎల్​కు 10 శాటిలైట్లు

న్యూఢిల్లీ: అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలోని వాణిజ్య కంపెనీ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్)’కు 10 ఇన్ ఆర్బిట్ కమ్యూనికేషన్ శాటిలైట్లను బదిలీ చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. శాటిలైట్ల బదిలీ వల్ల కంపెనీకి మరింత ఆర్థిక స్వతంత్రత వస్తుందని, మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు, ఇతర టెక్నాలజీ ఇన్నోవేషన్లు చేసేందుకు, ఉపాధిని పెంచేందుకు వీలవుతుందని తెలిపింది. ఎన్ఎస్ఐఎల్ షేర్ క్యాపిటల్​ను రూ.7,500 కోట్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.