సదువు, సౌలతుల్లో రాష్ట్రానికి గ్రేడ్–2

సదువు, సౌలతుల్లో రాష్ట్రానికి గ్రేడ్–2
  • పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ రిలీజ్ చేసిన కేంద్రం 
  • 479.9 పాయింట్లతో ఆకాంషి–2లో రాష్ట్రం
  • 543.8 స్కోరుతో గ్రేడ్ 1లో నిలిచిన ఏపీ

న్యూఢిల్లీ, వెలుగు: బడుల్లో చదువు, సౌలతులకు సంబంధించి ఆయా రాష్ట్రాలు, యూటీలకు పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ (పీజీఐ) గ్రేడ్ లను కేంద్రం ప్రకటించింది. 2021–-2022 ఏడాదికి గాను పీజీఐ2.0 రిపోర్ట్ ను ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 1000 పాయింట్లకు గాను 479.9 పాయింట్లు సాధించిన తెలంగాణ ఆకాంషి–2 (గ్రేడ్2)లో చోటు పొందింది. పక్క రాష్ట్రమైన ఏపీకి 543.8 పాయింట్లు లభించాయి. దీంతో ఆ స్టేట్  ఆకాంషి–1 అంటే గ్రేడ్ 1 జాబితాలో స్థానం నిలబెట్టుకుంది. గ్రేడ్ 2లో తెలంగాణతో పాటు 12 రాష్ట్రాలు ఉండగా, గ్రేడ్ 1లో ఏపీతో పాటు మరో 13 రాష్ట్రాలు ఉన్నాయి.  

పీజీఐ స్కోర్లు, గ్రేడ్లు ఇలా.. 

నూతన విద్యా విధానం 2020 అమలు తర్వాత రాష్ట్రాలు, యూటీల్లో అమలు చేసిన పాలసీ ప్రోగ్రాంలు, ప్రోగ్రెస్ ట్రాకింగ్, అంతరాల వంటి వాటిని గుర్తించేందుకు పీజీఐ 2.0 రిపోర్ట్ ను కేంద్రం సిద్ధం చేసింది. ఔట్ కమ్స్, గవర్నెన్స్ మేనేజ్మెంట్ అనే రెండు కేటగిరీల్లో 73 అంశాలను పరిగణనలోకి తీసుకుని, 6 డొమైన్లు (లర్నింగ్‌ అవుట్‌కమ్‌ అండ్‌ క్వాలిటీ, యాక్సెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫెసిలిటీస్, ఈక్విటీ, గవర్నెన్స్‌ ప్రాసెస్, టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌)గా విభజించి గ్రేడ్లు కేటాయించారు. మొత్తం1000 పాయింట్లకు సాధించిన స్కోరును బట్టి రాష్ట్రాలు, యూటీలకు గ్రేడ్లను ఇచ్చారు. వీటిలో దక్ష్ (941–1000), ఉత్కర్ష్ (881–940), అతి-ఉత్తమ్‌ (821–880) ఉత్తమ్‌ (761–820), ప్రచేష్ట–1(701–760), ప్రచేష్ట–2 (641–700), ప్రచేష్ట –3(581–640) ఆకాంషి–1 (521–580) , ఆకాంషి –2( 461–520), ఆకాంషి –3 (401–460) అనే గ్రేడ్లు ఉన్నాయి. ఇండెక్స్ లో టాప్ గ్రేడ్లు అయిన దక్ష్, ఉత్కర్ష్, అతి ఉత్తమ్ గ్రేడ్లు ఏ రాష్ట్రానికి గానీ, యూటీకి గానీ దక్కలేదు.  

ఆయా రాష్ట్రాలు, యూటీల గ్రేడ్లు ఇవే.. 

ప్రచేష్ట–2(641–-700): చండీగఢ్, పంజాబ్
ప్రచేష్ట–3(581-–640): గుజరాత్‌, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పుదుచ్చేరి, తమిళనాడు 
ఆకాంషి–1 (521–580): ఏపీతో పాటు మరో13 రాష్ట్రాలు
ఆకాంషి–2 (461–520): తెలంగాణతో పాటు మరో12 రాష్ట్రాలు
ఆకాంషి–3 (401–460): అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం