కోర్టుపై నమ్మకం పోతోంది… జనం ఫీలింగ్స్​ను సుప్రీంకు విన్నవించిన కేంద్రం

కోర్టుపై నమ్మకం పోతోంది… జనం ఫీలింగ్స్​ను సుప్రీంకు విన్నవించిన కేంద్రం

‘దిశ’ కేసులో ఎన్​కౌంటర్​తో సంబురాలు

‘నిర్భయ’ కేసులో ఉరి వాయిదాలతో ఆగ్రహాలు

‘వెటర్నరీ డాక్టర్(దిశ)ను రేప్​ చేసి చంపేసిన నిందితులు పోలీసుల ఎన్​కౌంటర్​లో చనిపోతే జనం సంబరాలు చేసుకున్నరు.. ఉరి శిక్ష అమలును వీలైనన్ని రోజులు పొడిగించుకోవడానికి నిర్భయ దోషుల చేష్టలు చూస్తుంటే వారు మండిపడుతున్నరు. న్యాయ వ్యవస్థలోని పలు నిబంధనలను దోషులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నరు. ఫలితంగా ఉరి అమలు పదే పదే వాయిదా పడుతోంది. దీంతో ప్రజలు న్యాయ వ్యవస్థపైన నమ్మకం కోల్పోతున్నరు’ అంటూ సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నవించింది. కేంద్రం, ఢిల్లీ గవర్నమెంట్​ తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా జస్టిస్​ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల బెంచ్​ ముందు వాదనలు వినిపించారు. దోషులను ఉరితీయడం చట్టాన్ని అమలుపరిచేందుకే తప్ప ఎవరి సంతోషంకోసమో కాదని మెహతా చెప్పారు. దోషులు అందరికీ ఒకేసారి శిక్ష అమలు చేయాలన్న కాన్సెప్టే లేదని వాదించారు. నిర్భయ దోషుల ఉరి అమలుపై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టే ఎత్తేయాలంటూ కేంద్రం, ఢిల్లీ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశాయి. మంగళవారం ఈ పిటిషన్​పై జరిగిన విచారణలో  ప్రభుత్వం తరఫున సొలిసిటర్​ జనరల్​ వాదనలు వినిపించారు. దోషులకు 2017 లో శిక్ష కన్ఫర్మ్ అయినా ఇప్పటి వరకూ అమలు కాలేదంటే.. మన వ్యవస్థ ఎలా ఉందో తెలుస్తోందన్నారు. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని మెహతా వాపోయారు.

ట్రయల్​ కోర్టుకు..

ఉరిశిక్ష అమలు విషయంలో కేంద్రం విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీంకోర్టు.. నిర్భయ దోషులు నలుగురికీ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా జవాబు ఇవ్వాలంటూ అందులో ఆదేశించింది. ఫ్రెష్​ డెత్​వారెంట్ జారీ చేయాలంటూ ట్రయల్​కోర్టును ఆశ్రయించేందుకూ తీహార్​ జైలు అధికారులకు పర్మిషన్​ ఇచ్చింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల పిటిషన్​సుప్రీంకోర్టులో విచారణలో ఉందనే కారణంతో డెత్​ వారెంట్ జారీకి నిరాకరించాల్సిన అవసరంలేదని స్పష్టతనిచ్చింది.

ఎగతాళి చేస్తున్నరు: నిర్భయ పేరెంట్స్

నిర్భయ దోషులు న్యాయ వ్యవస్థను ఎగతాళి చేస్తున్నరంటూ ట్రయల్​కోర్టులో నిర్భయ పేరెంట్స్ వాదించారు. వంతులవారీగా పిటిషన్లు దాఖలు చేస్తూ ఉరి అమలు వాయిదా పడేలా చేస్తున్నరని కోర్టుకు చెప్పారు. దోషులను ఉరితీసేందుకు ఫ్రెష్​ వారెంట్​ జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్​ను బుధవారం విచారిస్తామని అడిషనల్​ సెషన్స్​ జడ్జి ధర్మేందర్​ రాణా తెలిపారు.

మరోసారి సుప్రీంలో వినయ్ పిటిషన్

నిర్భయ దోషి వినయ్‌‌ శర్మ మంగళవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రపతి తన మెర్సీ పిటిషన్​ను తిరస్కరించడాన్ని కోర్టులో సవాల్ చేశాడు. వినయ్​ లాయర్​ ఏపీ సింగ్​ ఈ పిటిషన్​ దాఖలు చేశారు. తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ వినయ్ పెట్టుకున్న మెర్సీ పిటిషన్​ను ఈ నెల1న  రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ తిరస్కరించారు. కాగా, క్యూరేటివ్​ పిటిషన్​ రూపంలో వినయ్​ శర్మకు మరో అవకాశం కూడా ఉందని న్యాయ నిపుణులు చెప్పారు.