కేంద్ర సాహితీ అకాడమీ విశాలదృష్టితో పనిచేస్తోంది: ప్రొ.ఎస్వీ సత్యనారాయణ

కేంద్ర సాహితీ అకాడమీ విశాలదృష్టితో పనిచేస్తోంది: ప్రొ.ఎస్వీ సత్యనారాయణ

‘వెలుగు’ దినపత్రిక ఓపెన్ పేజీలో ఈ నెల 21న ‘కేంద్ర సాహిత్య అకాడమీకి ఎర్ర పక్షపాతం ?’  అనే శీర్షికన డా. పి. భాస్కరయోగి వ్యాసం చదివాను. అది ఆసాంతం అసత్యాలు, అభియోగాలతో నిండి ఉన్నది. ఆ వ్యాసంపై నా స్పందన ఇదీ..

వ్యాసం ప్రారంభంలోనే ‘కేంద్రంలో ఉన్న సాంస్కృతిక శాఖ ఉదారంగా వదిలేసిన కారణంగా కేంద్ర సాహిత్య అకాడమీ అనేక పిల్లిమొగ్గలు వేస్తున్నది. ముఖ్యంగా దాన్ని నడిపించే కన్వీనర్ కృత్తివెంటి శ్రీనివాసరావు చర్యల వల్ల అవార్డులు, నియామకాలు జాతీయవాద ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా వస్తున్నాయి’ అని వ్యాసకర్త ఆరోపించారు.

గత ఏడు దశాబ్దాలుగా కేంద్ర సాహిత్య అకాడమీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వ పెత్తనం, ప్రమేయం లేకుండా భారతీయ భాషల సాహిత్య సేవకు కృషి చేస్తున్నది. ఇందులో ఎవరి ఉదారతకు గానీ, నియంతృత్వానికి గానీ తావు లేదు. పైగా ‘దాన్ని నడిపించే కన్వీనర్’ అనడం ఆక్షేపణీయం.- సాహిత్య అకాడమీని వ్యక్తులు నడిపించరు. దాన్ని రాజ్యాంగం నడిపిస్తుంది.

నిర్దిష్టమైన ఆదర్శాలతో, ఉన్నతమైన ఆశయాలతో దాని కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. అకాడమీ కార్యదర్శి  శ్రీనివాసరావు  నిజాయతీగా, సంస్థ రాజ్యాంగం పట్ల నిబద్ధతతో, నిష్పక్షపాతంగా, నిర్విరామంగా పనిచేస్తూ.. భారతీయ భాషల సాహితీవేత్తల మన్ననలు పొందుతున్నారు. ఆయన పని విధానంపై బురద జల్లడం అభ్యంతరకరం. సాహిత్య అకాడమీ ఒంటికన్ను శుక్రుడిగా కాదు, విశాల దృష్టితో పనిచేస్తున్నది.

జాతీయవాద ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది ఏండ్లు దాటినా, దాని కర్రపెత్తనం అకాడమీపై పడకపోవడం హర్షణీయం. అయినా ఎనిమిదేండ్లకు పూర్వం గత 75 ఏండ్లుగా విజాతీయవాద ప్రభుత్వాలున్నాయా? భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని జైలు శిక్ష భరించిన నిజమైన దేశ భక్తులెందరో గతంలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు.

పారదర్శక ఎంపిక ఉంటుంది..

నిజమే భాస్కరయోగి పేర్కొన్నట్లు 1954లో ప్రారంభమైన సాహిత్య అకాడమీ మొదటి సభకు అధ్యక్షత వహించిన నెహ్రూ ‘తనను ప్రధానిగా కాక, కవిగా, రచయితగా గుర్తించి సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా నియమించినందుకు చాలా గర్వంగా ఉంది’ అని స్పష్టం చేశారు. అది అకాడమీ కొనసాగిస్తున్న ఉత్తమ వారసత్వం. భాస్కర యోగి ఉదహరించిన ధూర్జటి 'రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు’ అన్న స్పృహతోనే సాహిత్య అకాడమీ పాలకవర్గాల సేవకు దూరంగా ఉంటున్నది.

వ్యాసకర్త పేర్కొన్న పోతన్న తన కలాన్ని అమ్ముకోవడం ఇష్టం లేదని, పడుపుకూడు భుజించనన్న ధైర్యం గల సాహితీవేత్తలనే అకాడమీ గౌరవిస్తున్నది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తన విధానాలను మార్చుకోకుండా అకాడమీ సభ్యుల నియామకం, అవార్డుల ఎంపిక విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నది. అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుల ఎంపికకు ఒక ప్రక్రియ ఉంటుంది. ప్రతి భాషకు చెందిన రాష్ట్ర ప్రభుత్వం మూడు పేర్ల జాబితాను పంపుతుంది.

అకాడమీ గుర్తింపు పొందిన సాహిత్య సంస్థలు మూడేసి పేర్ల జాబితాలను పంపుతాయి. ఆయా విశ్వవిద్యాలయాలు మూడేసి పేర్లను ప్రతిపాదిస్తాయి. వీటిలోంచి ప్రభుత్వం పంపిన జాబితా నుంచి ఒకరినీ, సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరినీ, విశ్వవిద్యాలయాల ప్రతినిధిగా ఒకరిని జనరల్ కౌన్సిల్ కు ఎంపిక చేస్తారు. ఇదంతా ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా కొనసాగే ప్రక్రియ-. బస్సులో కర్చిప్ వేసినట్లు ఇందులో వేయడం సాధ్యం కాదు.

భావజాలాన్ని బట్టి అవార్డులు రావు

కేంద్ర సాహిత్య అవార్డుల ఎంపికకు ఒక పటిష్టమైన పద్ధతి ఉన్నది, కాబట్టే సువరం ప్రతాపరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, పుట్టపర్తి నారాయణాచార్యులు, ఉత్పల సత్యనారాయణాచార్యులు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పాలగుమ్మి పద్మరాజు, పీఎస్ఆర్ అప్పారావు, మాలతీ చందూర్, జీవీ సుబ్రహ్మణ్యం, రాయప్రోలు సుబ్బారావు, గుర్రం జాషువా, బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్ తదితరులకు అవార్డులు వచ్చాయి.

వీరిలో సంప్రదాయ సాహితీవేత్తలే ఎక్కువ. ఎడనెడ కొందరు ప్రగతిశీల రచయితలున్నారు. వారి భావజాలాలను బట్టి కాకుండా, సాహిత్య ప్రతిభను బట్టి ఎంపిక జరుగుతుంది. ఇక శ్రీశ్రీ, ఆరుద్ర, కె.శివారెడ్డి, నిఖిలేశ్వర్ వంటి కమ్యూనిస్టు కవులకు కూడా సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి. వీరు కమ్యూనిస్టులు అయినందున కవులు కారు అనగలమా? భాస్కరయోగి వంటి విజ్ఞులు ‘ఎర్ర కాకులు’, ‘ఎర్ర పక్షపాతం’, ‘ఎర్ర జబ్బు’, ‘ఎర్ర చీడ’, ‘ఎర్ర నక్కలు’ వంటి పదాలను ప్రయోగించడం ఆక్షేపణీయం.

అవాకులు చవాకులు వద్దు

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ఆధునిక సాహిత్య వైతాళికుడు, యుగకర్త గురజాడ అప్పారావు ప్రఖ్యాత దేశభక్తి గీతంలోని ‘సొంత లాభం కొంతమానుకుని -పొరుగువాడికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్ - దేశమంటే మనుషులోయ్’ అన్న కవితా పంక్తులను ఉటంకించారు. దేశ, విదేశాల్లోని తెలుగు వారంతా సంతోషించారు. ‘ప్రధాని నోట -తెలుగు మాట’ అంటూ పత్రికలు, ప్రచార సాధనాలు ఘనంగా ప్రశంసించాయి.

దీన్ని కూడా భాస్కరయోగి ఆక్షేపించడం ఆశ్చర్యకరం. అంతేకాదు జస్టిస్ పార్టీ పాసన కలవాడో, కమ్యూనిస్టు మేధావి ఎవరో ఈ వాక్యం ప్రధానికి అందించి ఉంటారనడం, అటు గురజాడనూ, ఇటు భారత ప్రధానమంత్రిని అవమానించడమే అవుతుంది. ఇక ప్రసార, ప్రచార మాధ్యమాలు, సాహిత్యరంగం, విశ్వవిద్యాలయాల్లో వామపక్ష ప్రగతిశీల, ప్రజాస్వామ్య సాహితీవేత్తల ప్రాబల్యం పెరగడం ఆధునిక యుగధర్మం. మార్క్సిజం ఒక జ్ఞాన సిద్ధాంతం.

మతసామరస్యం, లౌకిక విలువల పరిరక్షణ, సహనం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, సమసమాజ నిర్మాణ ఆకాంక్ష భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక విలువలు. వీటిని పరిరక్షించడానికి అంకితమైన ప్రగతిశీల రచయితలకు దళిత, బహుజన, మైనారిటీ సాహితీవేత్తలకు, -మహిళా రచయిత్రులకు గత దశాబ్ద కాలంగా సాహిత్య అకాడమీ అవార్డులు లభించడం పట్ల అక్కసు వెళ్లగక్కడం, అవాకులూ చవాకులూ పేలడం మానుకుని, ఆహ్వానించవలసిందిగా యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. - ప్రొ. ఎస్వీ సత్యనారాయణ, మాజీ వీసీ, తెలుగు యూనివర్సిటీ.