ఈ ఖనిజాలు కనిపెడితే పంట పండినట్లే .. క్రిటికల్ మినరల్స్ అన్వేషణపై మైనింగ్ శాఖ ఫోకస్

ఈ ఖనిజాలు కనిపెడితే పంట పండినట్లే .. క్రిటికల్ మినరల్స్ అన్వేషణపై  మైనింగ్ శాఖ ఫోకస్
  • అరుదైన ఖనిజాలను గుర్తిస్తే లగ్జరీ వస్తువుల ధరలు కిందికి
  • రక్షణ, పారిశ్రామిక, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెను మార్పులు
  • రంగంలోకి  భూగర్భ సర్వే ప్రైవేటు ఏజెన్సీలు
  • శాస్త్రవేత్తలకు హైదరాబాద్ జీఎస్ఐ ట్రైనింగ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ శిక్షణ

హైదరాబాద్, వెలుగు: క్రిటికల్, స్ట్రాటజికల్  మినరల్స్.. ఇవి భూమి మీద అరుదుగా లభించే ఖనిజాలు.  దేశ రక్షణ, పారిశ్రామిక, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, జియో కెమికల్ రంగాల్లో దేశ గతిని మార్చే ఈ మినరల్స్‌‌‌‌ను కనిపెట్టడంపై  కేంద్ర మైనింగ్ శాఖ ఫోకస్  పెట్టింది. జియాలాజికల్  సర్వే ఆఫ్  ఇండియా( జీఎస్ఐ) నేతృత్వంలో వీటిని గుర్తించేందుకు కసరత్తును ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర భూగర్భ సర్వే సంస్థలతో పాటు ప్రైవేట్  మైనింగ్ ఏజెన్సీల సాయంతో క్రిటికల్  మినరల్స్‌‌‌‌ను  అన్వేషించేందుకు ప్రణాళికలు సిద్ధం  చేస్తోంది. కొంత కాలంగా కేంద్ర భూగర్భ సర్వే సంస్థ అరుదుగా దొరికే ఈ ఖనిజాలను కనుగొనేందుకు ప్రయత్నించగా సత్ఫలితాలు ఇవ్వలేదు. కేంద్ర మైనింగ్ శాఖ చొరవతో రంగంలోకి దిగిన హైదరాబాద్‌‌‌‌లోని జీఎస్ఐ ట్రైనింగ్  ఇన్‌‌‌‌స్టిట్యూట్.. దేశంలో ఉన్న  ప్రభుత్వ, ప్రైవేటు భూగర్భ సర్వే నిపుణులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

ఇప్పటి వరకు ఎందుకు గుర్తించలేదు?

చైనాలో క్రిటికల్ మినరల్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తించే బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అక్కడి ప్రభుత్వం అప్పగిచింది. ఫలితంగా ఖనిజాలను గుర్తించడం చాలా సులువైంది. మినరల్స్‌‌‌‌ను గుర్తించాక ఆ మైన్లను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే భారత్‌‌‌‌లో దానికి విరుద్ధంగా జరిగింది. క్రిటికల్  మినరల్స్‌‌‌‌ను కనుక్కునేందుకు కేంద్ర భూగర్భ సర్వే నిపుణులు మాత్రమే మొదటి నుంచి ప్రయత్నిస్తూ వచ్చారు. 

భూమిలో దొరికే అరుదైన ఖనిజాలు కావడం వల్ల వాటి ఉనికిని గుర్తించడం ఆలస్యమైంది. ఆధునిక ప్రపంచంలో ఈ మినరల్స్  ప్రాధాన్యత పెరగడంతో 2016లో కేంద్ర మైనింగ్ శాఖ ‘నేషనల్  మైనింగ్ ఎక్స్ ప్లొరేషన్  ట్రస్ట్‌‌‌‌’ను  ఏర్పాటు చేసి కొన్ని రూ.వందల కోట్ల నిధులను సమీకరించింది. ఆ నిధులతో క్రిటికల్  మినరల్స్‌‌‌‌ను గుర్తించే బాధ్యతను ప్రైవేట్  ఏజెన్సీలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది.  ఈ క్రమంలో కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు రావడంతో ప్రాజెక్టు రిపోర్టు ఆధారంగా ప్రైవేట్ ఏజెన్సీలకు ఈ ఖనిజాలను గుర్తించే అవకాశం కల్పిస్తామని మైనింగ్ శాఖ తెలిపింది. 

దాదాపు 80 శాతం ఏజెన్సీల ప్రాజెక్టు రిపోర్టులు మైనింగ్  శాఖ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో వాటిని తిరస్కరించారు. ఖనిజాలను కనుగొనే విషయంలో హైదరాబాద్‌‌‌‌లోని జీఎస్ఐ‌‌‌‌ ట్రైనింగ్  సెంటర్‌‌‌‌‌‌‌‌కు విశేష అనుభవం ఉంది. ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌లోని నిపుణులు ఇచ్చిన శిక్షణ ఆధారంగానే శాస్త్రవేత్తలు కర్నాటకలో బంగారం, జమ్మూకాశ్మీర్‌‌‌‌లో లిథియం, రాజస్థాన్‌‌‌‌లో కాపర్  ఖనిజాలను గుర్తించారు. 

దేశంలో 13 భూగర్భ సర్వే శిక్షణ కేంద్రాలు ఉండగా.. వాటికి హైదరాబాద్‌‌‌‌లోని ట్రైనింగ్  సెంటరే హెడ్డాఫీస్.  దేశం మొత్తంలో ఎక్కడ జియాలాజికల్  సైంటిస్టుగా పనిచేయాలన్నా.. కచ్చితంగా హైదరాబాద్‌‌‌‌లో శిక్షణ  తీసుకోవాల్సిందే. శిక్షణ ఇవ్వడంలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు క్రిటికల్  మినరల్స్‌‌‌‌పై  శిక్షణ ఇచ్చే బాధ్యతను కేంద్ర మైనింగ్ శాఖ.. హైదరాబాద్‌‌‌‌లోని జీఎస్ఐ‌‌‌‌ ట్రైనింగ్  సెంటర్‌‌‌‌‌‌‌‌కు అప్పగించింది.

క్రిటికల్, స్ట్రాటజికల్ మినరల్స్ అంటే ఏమిటి?

భారత్‌‌‌‌కు అవసరమైన 30 రకాల క్రిటికల్  లేదా స్ట్రాటజికల్  మినరల్స్ జాబితాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ఖనిజాల జాబితాలో ఆంటిమోనీ, బెరీలియం, బిస్మత్, కోబాల్ట్, కాపర్, గాలియం, జెర్మేనియం, గ్రాఫైట్, హాఫ్నియం, ఇండియం, లిథియం, మాలిబ్డినం, నియోబియం, నికెల్, పీజీఈ, ఫాస్పరస్, పొటాష్, ఆర్ఈఈ, రెనియం, సిలికాన్, స్ట్రోంటియం, టెల్లియం, టెల్యురియం , టైటానియం, టంగ్‌‌‌‌స్టన్, వెనాడియం, జిర్కోనియం, సెలీనియం, క్యాడ్మియం ఉన్నాయి. ఈ ఖనిజాలు భూమి మీద చాలా అరుదుగా దొరుకుతాయి. ఇందులో కాపర్, లిథియం నిల్వలను కొన్నిచోట్ల గుర్తించారు. కానీ అవి పూర్తి స్థాయిలో బయటపడలేదు. ఈ ఖనిజాలను గుర్తించిన దేశాలు పారిశ్రామికంగా, ఆర్థికంగా, మౌలిక వసతులపరంగా, రక్షణ పరంగా చాలా అభివృద్ధిని సాధించాయని నిపుణులు చెబుతున్నారు.

దేనికి ఉపయోగిస్తారు?

క్రిటికల్, స్ట్రాటజికల్ మినరల్స్ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే రంగాల గతినే మార్చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని ప్రధానంగా యుద్ధ విమానాలు, ఆయుధాలు, బ్యాటరీల తయారీకి ఉపయోగిస్తారు. పారిశ్రామికంగా చూసుకుంటే మైక్రో చిప్స్, సెన్సార్స్, లగ్జరీ వస్తువుల తయారీలో వినియో గిస్తారు. ఖరీదైన కార్లలో ఈ మినరల్స్‌‌‌‌ను వాడుతారు. దేశంలో క్రిటికల్  మినరల్స్‌‌‌‌ను ఇంకా పూర్తి స్థాయిలో గుర్తించనందు వల్ల ఇప్పుడు కొన్ని కార్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలో ఈ ఖనిజాలను గుర్తిస్తే.. ప్రీమియం కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.

మౌలిక వసతులు కూడా ఈ మినరల్స్ వల్ల మెరుగవు తాయి. కాంక్రీట్ మిశ్రమంలో వీటిని కలిపితే రోడ్ల మన్నిక మరింత పెరుగుతుం దని నిపుణులు తెలిపారు. వాటిని గుర్తిస్తే దేశాభివృద్ధి వేగంగా పుంజుకునే అవకాశం ఉంది. చైనా స్పీడ్​గా అభివృద్ధి కావడంలో ఈ ఖనిజాల పాత్ర కూడా ఉంది. చైనాలో క్రిటికల్‌‌‌‌ను భారీ ఎత్తున గుర్తించారు. అందుకే ఆ దేశంలో అనతి కాలంలోనే పారిశ్రామిక, రక్షణ రంగాలు వేగంగా పురోగమించాయి.

నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తం

రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఎన్‌‌‌‌జీఆర్ఐ, ఏఎండీ, సింగరేణి నిపుణులతో పాటు కేంద్ర భూగర్భ సర్వే శాస్ట్రవేత్తలకు, 20కి పైగా ప్రైవేటు ఏజెన్సీ ప్రతినిధులకు శిక్షణ ఇస్తున్నాం. ఈనెల 22 నుంచి నాలుగు రోజుల పాటు ‘నేషనల్  జియోసైన్స్  డేటా రెపాజిటరి (ఎన్‌‌‌‌జీడీఆర్) అండ్ ఎక్స్ ప్లొరేషన్  ఆఫ్  క్రిటికల్  అండ్  స్ట్రాటజిక్  మినరల్స్’ పేరుతో శిక్షణతో పాటు వర్క్‌‌‌‌షాప్  కూడా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి కేంద్ర మైనింగ్  శాఖ సెక్రటరీ కాంతారావు, అడిషనల్  సెక్రటరీ సంజయ్  లేహియా, జీఎస్ఐ డైరెక్టర్  జనార్దన్  ప్రసాద్  హాజరవుతున్నారు. 

ఈ శిక్షణ తర్వాత మైనింగ్ శాస్త్రవేత్తలకు  క్రిటికల్  మినరల్స్‌‌‌‌  ఎక్కడ ఉంటాయి? అవి ఉండే నేల స్వభావం ఎలా ఉంటుంది? అన్న  అంశాలపై అవగాహన ఏర్పడి వాటిని కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుంది.- 
మ్యాథ్యూ జోసెఫ్,డిప్యూటీ డైరెక్టర్  జనరల్, జీఎస్ఐ ట్రైనింగ్ సెంటర్, హైదరాబాద్