హైదరాబాద్: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయమని ఎవరూ అడగటం లేదని.. కేవలం పరీక్షను పోస్ట్ పోన్ చేయమని మాత్రమే అభ్యర్థులు అడుగుతున్నారని.. వారి డిమాండ్‌లో న్యాయం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 1 అభ్యర్థులకు సంఘీభావంగా ప్రశాంతంగా నిరసన చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించిన బండి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు.
గ్రూప్ 1 విషయంలో ప్రభుత్వానికి మొండి పట్టు తగదని.. అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కావాలనే జీవో నెంబర్ 29 తీసుకొచ్చిందని.. ఈ జీవో వెనక రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర ఉందని అభ్యర్థులు భయపడుతున్నారని.. ఇకనైనాప్రభుత్వం మొండి వైఖరి వీడాలని సూచించారు. గ్రూప్ 1లో రిజర్వేషన్లు ఉంచుతారా రద్దు చేస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులపై ప్రతిరోజు లాఠీచార్జ్ జరుగుతోందని.. వారిని చూస్తుంటే బాధ కలుగుతోందని.. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టెన్షన్ వాతావరణంలో అభ్యర్థులు పరీక్షలు రాయలేరని.. ప్రభుత్వం వారి సమస్యలు విని పరిష్కరించాలని కోరారు.
ALSO READ | GO 29, GO 55 మధ్య తేడా ఏంటి : గ్రూప్ 1 అభ్యర్థులు ఎందుకు రోడ్లెక్కుతున్నారు..?
నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ఆటలాడుతోందని.. మా ర్యాలీలోకి చొరబడి విధ్వంసం సృష్టించే కుట్ర చేశారని గులాబీ పార్టీపై మండిపడ్డారు. నిరుద్యోగుల ముసుగులో గొడవలు సృష్టించాలని ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని.. ఘటన స్థలం నుండి తరలించారని క్లారిటీ ఇచ్చారు. కాగా, ఇవాళ అశోక్ నగర్ వెళ్లిన బండి సంజయ్ గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతు తెలిపారు. చలో సచివాలయానికి పిలుపునిచ్చి వేల సంఖ్యలో గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి సచివాలయ ముట్టడికి బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకుని నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు.