సెంట్రల్ స్కీమ్స్ అమలు చేస్తలేరు

సెంట్రల్ స్కీమ్స్ అమలు చేస్తలేరు
  • టీఆర్ఎస్ సర్కార్ రాజకీయాలు చేస్తోంది 
  •  బియ్యం రీసైక్లింగ్​లో గులాబీ నేతలున్నరు 
  •  కేసీఆర్​కు దేశం, రాష్ట్రం కన్నా కుటుంబమే ఎక్కువని విమర్శ

హైదరాబాద్/గచ్చిబౌలి/శేరిలింగంపల్లి, వెలుగు: కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదని, నిధులు దారి మళ్లిస్తున్నారని పార్లమెంట్ వ్యవహారాలు, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ‘‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’’ కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేంద్రమంత్రి పర్యటిస్తున్నారు. శుక్రవారం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్–బీజాపూర్ హైవే నిర్మాణం కోసం 2017లోనే కేంద్రం రూ.924 కోట్లు కేటాయించిందని జోషి చెప్పారు. కానీ రాష్ట్ర సర్కార్ భూసేకరణ చేయకపోవడంతో పనులు జరగడం లేదన్నారు. ‘‘రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం 2019–20లో రూ.2,057 కోట్లు, 2020–21లో రూ.2,602 కోట్లు, 2021–22లో రూ.2,420 కోట్లు, 2022–23లో రూ.3,500 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. అయినా భూసేకరణకు రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదు. కేసీఆర్​కు సంపాదించుకోవడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర అభివృద్ధిపై లేదు” అని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు అమలు చేయకుంటే, ప్రజా సంక్షేమంపై దృష్టిపెట్టకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి... 

టీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధి పనులు పక్కనపెట్టి రాజకీయాలు చేస్తోందని జోషి మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం తదితర హామీలు ఏమైనయని కేసీఆర్​ను ప్రశ్నించారు. కేసీఆర్​కు దేశం, రాష్ట్రం కన్నా కుటుంబమే ఎక్కువని విమర్శించారు. నీతి ఆయోగ్ మీటింగ్ కు కేసీఆర్ రాలేదని, ఆయనకు రాష్ట్ర అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలిసిపోయిందని అన్నారు. బియ్యం రీసైక్లింగ్ లో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని.. పాత బస్తీకి మెట్రో రాకుండా ఎంఐఎంతో కలిసి కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బడ్జెట్ ఆమోదం లేకుండానే నిధులు ఖర్చు చేసినట్లు కాగ్ పేర్కొందని.. దీనిపై కేసీఆర్, కేటీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కొండాపూర్ ఆస్పత్రి సందర్శన.. 

కొండాపూర్​లోని ఏరియా ఆసుపత్రిని ప్రహ్లాద్ జోషి సందర్శించారు. ఇక్కడ పీఎం కేర్ ఫండ్స్​తో ఏర్పాటు చేసిన ఆక్సిజన్​ప్లాంట్, కరోనా వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తోందన్నారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులు, మెడికల్ ఎక్విప్ మెంట్ అందజేస్తున్నా వినియోగించు కోవడం లేదన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఖాళీలు చాలా ఉన్నాయని, ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. 

ముఖ్య నేతలతో మీటింగ్.. 

ప్రహ్లాద్ జోషి ఉదయం హైదర్​నగర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సిద్ధి నర్సింగ్ ఇంట్లో టిఫిన్ చేశారు. అనంతరం డివిజన్ లో పర్యటించారు. మధ్యాహ్నం హఫీజ్​పేటలోని ఓ హోటల్​లో పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మీటింగ్​లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి శని, ఆదివారాల్లో కూడా నియోజకవర్గంలో పర్యటిస్తారు.