
- వ్యవసాయేతర అవసరాలకు మళ్లుతున్నట్లు అనుమానం
- ఏటా 15--–20 శాతం పెరుగుతున్న వాడకం
- యూరియా వినియోగంపై రాష్ట్రానికి సూచనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూరియా వినియోగం ఏటా పెరుగుతున్నది. ఒకవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రెండు సార్లు విత్తనాలు వేసుకోవాల్సి వస్తే రైతులు మళ్లీ యూరియా వేస్తుండగా, ఇంకోసారి అవసరానికి మించి కూడా వినియోగిస్తున్నారు. వీటికి తోడుగా వ్యవసాయేతర రంగాలకు యూరియా మళ్లుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే వివరాలు ఇచ్చింది.
రాష్ట్రంలో ప్రతి ఏటా 15% నుంచి 20% యూరియా వినియోగం పెరుగుతున్నట్టు లెక్క తేలింది. పాల కల్తీ, పేలుడు పదార్థాల తయారీ, ఇతర పారిశ్రామిక అవసరాలకు యూరియా అక్రమంగా మళ్లిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021-–22లో సుమారు 12 లక్షల టన్నుల యూరియా వినియోగించగా, 2024-–25 నాటికి ఇది 18.5 లక్షల టన్నులకు చేరుకుంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో వరి, పత్తి పంటలు ప్రధానంగా సాగవుతున్నాయి. గత రెండు, మూడేండ్లుగా యావరేజ్‌గా కోటి 10 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని ఈ రెండు పంటలే నమోదు చేస్తున్నాయి.
వీటికి యూరియాను అధిక మోతాదులో వాడుతున్నారు. 2023–-24 రబీ సీజన్‌తో పోలిస్తే 2024–-25 రబీ సీజన్‌లో యూరియా అమ్మకాలు 21శాతం అధికంగా నమోదయ్యాయి. అలాగే, 2024 ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత 2025 ఖరీఫ్ సీజన్‌లో యూరియా వినియోగం 12.4 శాతం ఎక్కువగా ఉంది.
వ్యవసాయేతర రంగాలకు మళ్లుతున్నదా ?
యూరియా వినియోగంలో పెరుగుదలకు వ్యవసాయ అవసరాలు ఒక కారణమైతే, వ్యవసాయేతర రంగాలకు మళ్లింపు మరొక కారణంగా కనిపిస్తున్నది. పాల కల్తీ (సింథటిక్ మిల్క్ తయారీ), అమ్మోనియం నైట్రేట్‌లాంటి పేలుడు పదార్థాల తయారీ, ప్లాస్టిక్, ప్లైవుడ్, రసాయన పరిశ్రమలకు యూరియా అక్రమంగా మళ్లించబడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ అక్రమ వినియోగం వల్ల రైతులకు యూరియా కొరత ఏర్పడుతున్నది. కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం.. దేశవ్యాప్తంగా యూరియా మళ్లింపు వల్ల ఏటా రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నది. తెలంగాణలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని భావిస్తున్నది.
అందులో భాగంగానే రాష్ట్రంలో యూరియా సరఫరాపై సెంట్రల్ విజిలెన్స్నిఘా పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేంద్రం ఫర్టిలైజర్ ఫ్లయింగ్ స్క్వాడ్స్‌తో 370 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, 70వేల బ్యాగుల యూరియాను స్వాధీనం చేసుకున్నది. 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. 2020-–21లో 10.50 లక్షల టన్నులు, 2021–-22లో 12 లక్షల టన్నులు, 2022–-23లో 13.80 లక్షల టన్నులు, 2023–-24లో 16 లక్షల టన్నులు, 2024–-25లో దాదాపు 18.50 లక్షల టన్నుల యూరియా వినియోగం అయినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
లోటు వర్షపాతం.. అధిక వర్షాలతోనూ సమస్యే
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు యూరియా వినియోగంపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. వర్షాల మధ్య గ్యాప్ ఉండడంతో విత్తనాలు మొలకెత్తకపోవడం, మరికొన్నిసార్లు అధిక వర్షపాతంతో మొలకలు, విత్తనాలు కొట్టుకపోవడం కారణంగా రైతులు రెండుసార్లు విత్తనాలు వేయాల్సి వస్తుంది. దీనివల్ల యూరియా వినియోగం రెట్టింపు అవుతున్నది. ఇంకోవైపు అవసరానికి మించి రైతులు యూరియా వాడుతున్నట్లు తేలింది. రైతుల్లో పోషకాల సమతుల్యతపై సరైన అవగాహన లేకపోవడం వల్ల, కొందరు సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువ యూరియాను వాడుతున్నారు.
వరి పంటకు ఎకరాకు సిఫార్సు చేసిన యూరియా మోతాదు సుమారు 110 కిలోలు. ఇది మూడు లేదా నాలుగు దఫాల్లో వేయాలి. అయితే, అంతకు మించి 130 నుంచి 140 కిలోలు అంటే ఎకరాకు 30–40 కిలోలు అధికంగా వాడుతున్నారు. పత్తి పంటకు ఎకరాకు సిఫార్సు చేసిన యూరియా మోతాదు సుమారు 132 కిలోలుగా ఉన్నది. ఇది కూడా అంతకు మించి వేస్తున్నారు. ఈ అధిక వినియోగం భూమిని ప్రభావితం చేయడంతోపాటు ఆ పంటల ఉత్పత్తులను వినియోగిస్తున్న జనాల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నది. దీంతో భవిష్యత్తులో పోషకాల అసమతుల్యతకు దారితీసి, పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. అలాగే, పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి.