
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను ఆపాలంటూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్ కావాలని వేసిందేనని, దీంట్లో నిజాయితీ లేదని చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌ల ధర్మాసనం సీరియస్ అయ్యింది. అంతేగాక పిల్ వేసిన పిటిషనర్‌పై లక్ష రూపాయల జరిమానా విధించింది. సెంట్రల్ విస్టా నిర్మాణం దేశానికి ఎంతో ముఖ్యమని, చాలా ప్రాధాన్యతతో కూడిన జాతీయ ప్రాజెక్టు అని కోర్టు వ్యాఖ్యానించింది. సెంట్రల్ విస్టా నిర్మాణంపై చట్టబద్ధత విషయంలో సుప్రీం కోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తు చేసిన ఢిల్లీ హైకోర్టు.. ఈ ప్రాజెక్టు పనులను ఆపాల్సిన అవసరం లేదని వివరించింది.