వాగుల్లో వరదకు లెక్క..టెలీమీటర్లు ఏర్పాటు

వాగుల్లో వరదకు లెక్క..టెలీమీటర్లు ఏర్పాటు

భద్రాచలం, వెలుగు:  వానాకాలం  వాగుల్లో వరద ఉధృతిపై నిఘా పెట్టేందుకు దేశవ్యాప్తంగా  కేంద్ర జలసంఘం(సీడబ్ల్యుసీ) టెలీమీటర్లు ఏర్పాటు చేస్తోంది.  గోదావరి వరదలు వచ్చినప్పుడు తీర ప్రాంత ప్రజలను అలర్ట్​ చేసేందుకు కేంద్ర జలసంఘం కొత్త టెక్నాలజీ వాడకానికి  శ్రీకారం చుట్టింది.  ఇంత కాలం గోదావరి, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లోనే  గేజ్​ స్టేషన్లను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, నదీ ప్రవాహం లెక్కలు కట్టి ఎప్పటికప్పుడు ఫోర్‍కాస్ట్ వెల్లడించేది.  అయితే కొంత కాలంగా వారి లెక్కలు కూడా తప్పుతున్నాయి.  రాత్రికి రాత్రే వరద పెరిగిపోవడం, ఉపనదులు, గోదావరి తీర ప్రాంతాల్లో వారు లెక్కకట్టిన ప్రవాహం కంటే కూడా ఎక్కువ వరద వస్తోంది.  దీంతో పక్కాగా ప్రవాహాన్ని లెక్కించి ఫోర్ కాస్ట్ ఇవ్వాలని నిర్ణయించింది.  గోదావరికి ఉపనదులతో పాటు కొన్ని పెద్దవాగుల నుంచి వరద వచ్చి చేరుతోంది. వాగుల్లోని నీటి ప్రవాహాన్ని లెక్కకట్టక పోవడం వల్లనే తమ అంచనాలు తప్పుతున్నాయని కేంద్ర జలసంఘం వాగులపైనా గేజ్ స్టేషన్ల ఏర్పాటుకు నడుంబిగించింది.  

ఇవిగో ఇక్కడ..

భద్రాచలం నుంచి ఎగువన కాళేశ్వరం వరకు గోదావరి, ఉపనదులపై అనేక చోట్ల సీడబ్ల్యుసీ గేజ్ స్టేషన్లు ఉన్నాయి.  ములుగు జిల్లా పేరూరు, రామన్నగూడెం(ఏటూరునాగారం), దుమ్ముగూడెం, భద్రాచలం, కాళేశ్వరంలో ఇవి ఉన్నాయి. ఉపనదులు కిన్నెరసాని, ముర్రేడు, తాలిపేరుల వద్ద కూడా ఏర్పాటు చేశారు.  వీటి పరిధిలో అనేక పెద్ద వాగులు వర్షాకాలంలో  ఉప్పొంగి  గోదావరిలో కలుస్తున్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని రొయ్యూరు గ్రామం వద్ద జంపన్నవాగు, భూపాలపల్లి జిల్లా అడవిసోమన్​పల్లి వద్ద మానేరు, ఇదే జిల్లాలో ఆంక్షాపూర్‍ వద్ద చలివాగు, అందుకుతండా వద్ద మోరంచవాగు, కరీంనగర్‍జిల్లా వావిలాల వద్ద మానేరు, పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి వద్ద పెద్దవాగు నీటి ప్రవాహాలు కూడా గోదావరిలో కలుస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో అధిక వర్షం కురిసినప్పుడు ఈ వాగులు వరదలతో ఉప్పొంగుతున్నాయి.  అందుకే ఈ వాగులపై కూడా గేజ్‍స్టేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర జలసంఘానికి చెందిన నిపుణుల బృందం సూచించింది.  ఈ బృందం భద్రాచలం నుంచి పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి వద్ద పెద్దవాగు వరకు ఉన్న 55 కి.మీల దూరంలో గోదావరి లెవల్స్ సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాయో..?  తెలుసుకునేందుకు సర్వే చేసి రిపోర్టు అందించింది. దీని ప్రకారం వర్షాకాలంలో ఈ వాగు పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షపాతం ప్రకారం ఎంత మేర వరద గోదావరిలో కలుస్తుంది..? భద్రాచలం వద్ద దాని ప్రభావం ఎంత ఉంటుంది..?అనే దానిపై స్పష్టమైన లెక్కను సీడబ్ల్యూసీ అంచనా కడుతుంది. ఇక్కడ టెలీమీటర్​ను ఏర్పాటు చేసేందుకు  స్థలం కోసం రెవెన్యూ శాఖను కోరింది.  ఇదే ప్రకారం జంపన్నవాగు, మోరంచవాగు,  మానేరు, చలివాగు తదితర వాగులపై కూడా సర్వే చేశారు.  గోదావరి, ఉపనదులు కిన్నెరసాని, ముర్రేడు, తాలిపేరులతో పాటు ఈ వాగులపై మొత్తం 15 చోట్ల గేజ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని రిపోర్టు అందించారు.  ఈ రిపోర్ట్​ ఆధారంగా వాగుల వద్ద వర్షపాతం, వాగు లోతును డిజిటలైజ్డ్ వివరాలను టెలీమీటర్ల ద్వారా సీడబ్ల్యుసీ సేకరించనుంది. కెమెరాల్లోని సెన్సార్లు పక్కాగా వివరాలు ఇవ్వనున్నాయి. వరదల కాలం వచ్చేనాటికల్లా వీటి ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేలా అడుగులు వేస్తున్నారు.