46 జిల్లాల్లో కరోనా పంజా..కఠిన ఆంక్షలు పెట్టండి

46 జిల్లాల్లో కరోనా పంజా..కఠిన ఆంక్షలు పెట్టండి

న్యూఢిల్లీ: కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పది రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా పాజిటివిటీ రేటుతో పాటు కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో 10 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటుందని చెప్పిన కేంద్రం.. ఆ జిల్లాల్లో జనం బయట తిరగకుండా, గుంపులు లేకుండా ఆంక్షలు విధించాలని సూచించింది. మరో 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం దాకా ఉందని పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా టెస్టులను పెంచాలని సూచించింది. కరోనా కేసులు పెరుగుతున్న ఇలాంటి టైంలో నిర్లక్ష్యంచేస్తే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్​, మణిపూర్​లో పరిస్థితులపై శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష చేసింది. ఆ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న యాక్టివ్​ కేసుల్లో 80% వరకు హోంఐసోలేషన్​లోనే ఉన్నారని తెలిపింది. హోం ఐసోలేషన్​లో ఉన్న వారిపై మరింత దృష్టి పెట్టాలని సూచించింది. వ్యాక్సినేషన్​ వేగం పెంచాలని ఆదేశించింది. రాష్ట్రాలు వాడుతున్న దాన్ని బట్టి వ్యాక్సిన్​ డోసులను కేటాయిస్తామని స్పష్టం చేసింది. అన్ని ప్రైవేట్​ ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్​ ప్లాంట్లు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. 

వాళ్లకు నెగెటివ్ సర్టిఫికెట్ మస్ట్: కర్నాటక 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కర్నాటక సర్కార్ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. కేసులు ఎక్కువున్న కేరళ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి వచ్చేటోళ్లకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ సర్టిఫికెట్ మూడ్రోజుల కంటే పాతది కావొద్దని చెప్పింది. ఫ్లైట్, బస్, ట్రైన్​తో పాటు సొంత వెహికల్స్​లో వచ్చేటోళ్లకూ ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టంచేసింది. హెల్త్ కేర్ సిబ్బంది, రెండేండ్లలోపు పిల్లలకు మాత్రం సర్టిఫికెట్ అవసరంలేదంది.

కేరళలో మైక్రో కంటెయిన్​మెంట్​ జోన్లు

కేసులు పెరుగుతున్న అన్ని చోట్లా మైక్రో కంటెయిన్​మెంట్​జోన్లను ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు లోకల్​బాడీల సాయం తీసుకోనుంది. టెస్టులను పెంచడంతో పాటు కరోనా సోకిన వారి కాంటాక్ట్​లను గుర్తించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. కాగా, శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 20,772 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్కరోజులో 116 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 16,701కి పెరిగింది.