- నగర్ వన్ యోజన కింద రూ.28 కోట్లు కేటాయింపు
- 14 మున్సిపాలిటీల్లో నిర్మాణానికి అటవీ శాఖ ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా మరో 14 అర్బన్ ఫారెస్ట్ పార్కులు (నగర్ వనాలు) అందుబాటులోకి రానున్నాయి. 9 జిల్లాల్లోని మున్సిపాలిటీల పరిధిలో ఈ పార్కుల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘నగర్ వన్ యోజన’ కింద నిధులు మంజూరు చేస్తున్నది. ఒక్కో పార్కుకు రూ.2 కోట్ల చొప్పున.. మొత్తం 14 పార్కులకు రూ.28 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఆయా మున్సిపాలిటీల్లోని అటవీ బ్లాకుల్లో పార్కులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర అటవీ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
14 పార్కుల నిర్మాణానికి అటవీ శాఖ పంపిన ప్రపోజల్స్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. మంచిర్యాల జిల్లాలో రెండు, ఆదిలాబాద్ జిల్లాలో రెండు, మేడ్చల్ 2, వికారాబాద్లో 4, భూపాలపల్లి 1, కొత్తగూడెంలో 1, జగిత్యాలలో 1, పెద్దపల్లిలో 1చొప్పున పార్కులు నిర్మించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. పార్కుల చుట్టూ ప్రహరీగోడల నిర్మాణం, కంచెల ఏర్పాటు, ఎంట్రన్స్ ఆర్చ్ గేటు, వాకింగ్– జాగింగ్ ట్రాక్‌లు, యోగా షెడ్లు, ఓపెన్ జిమ్స్, పిల్లల కోసం ప్లే ఏరియా, వనభోజనాలకు అనువైన ప్రాంతాలు, తాగునీరు, వాష్ రూమ్స్ సౌకర్యం, సైక్లింగ్, బెంచీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. కాగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ.360 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 75,748 ఎకరాల్లో 109 అర్బన్ పార్కుల ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్తోంది.
