- కేంద్ర ప్రాయోజిక పథకం కింద రూ.327.55 కోట్లకు ఆమోదం
- రాజ్యసభలో అనిల్ కుమార్ ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బలోపేతం చేయడంలో భాగంగా మొత్తం 511 పీజీ వైద్య సీట్లను ఆమోదించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంగళవారం రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో కొత్త పీజీ కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు కోసం కేంద్ర ప్రాయోజిత పథకం కింద రూ. 327.55 కోట్లను ఆమోదించామని మంత్రి పేర్కొన్నారు. ‘‘ఈ నిధులను కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో భరిస్తాయి.
ఉస్మానియా మెడికల్ కాలేజీ (హైదరాబాద్) లో అత్యధికంగా 145 సీట్లు (మొదటి విడతలో 113, రెండో విడతలో 32) కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్) లో 92 సీట్లు (89+3), గాంధీ మెడికల్ కాలేజీ (సికింద్రాబాద్) లో 91 సీట్లు (77+14), సిద్దిపేట మెడికల్ కాలేజీలో 80 సీట్లు, నల్గొండలో 30, సూర్యాపేటలో 25, ఆదిలాబాద్ రిమ్స్ లో 22, నిజామాబాద్ లో16, మహబూబ్‌నగర్ లోని10 కాలేజీల్లో సీట్లు పెరిగాయని వివరించారు.
ఐదేళ్లలో రూ. 6.21 లక్షల కోట్ల యూరియా సబ్సిడీ
దేశవ్యాప్తంగా గత ఐదేళ్ల కాలంలో (2020–-21 నుంచి 2024–-25 వరకు) యూరియా సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.6,21,944.29 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. మంగళవారం రాజ్యసభలో తెలంగాణ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో 2024-–25 ఆర్థిక సంవత్సరంలో (తాత్కాలిక అంచనాల ప్రకారం) సుమారు 4.77 లక్షల టన్నుల ఇన్‌లాండ్ చేపల ఉత్పత్తి జరిగిందని కేంద్ర మత్స్య, పాడిపరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడించారు. మంగళవారం లోక్‌సభలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
వరంగల్ జిల్లాలో 2024-–25 పంట కాలానికి సంబంధించి రైతుల నుంచి 15.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 2.95 లక్షల బేళ్ల పత్తిని సేకరించామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
