సింగిల్ డోస్ చాలు.. ఇండియాలోకి మరో కరోనా వ్యాక్సిన్‌

సింగిల్ డోస్ చాలు.. ఇండియాలోకి మరో కరోనా వ్యాక్సిన్‌

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో మరో ముందడుగు పడింది. భారత్‌లో ఇంకో కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.  అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ను భారత్‌లో అత్యవసర వినియోగానికి అప్రోవల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారం ప్రకటించారు. ఇప్పటి వరకు దేశంలో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి, మోడర్నా వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటే.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ను ఒకే డోసు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ‘‘ఇండియా కరోనా వ్యాక్సిన్ బాస్కెట్‌లో మరో టీకా యాడ్ అయింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన సింగిల్ డోస్‌ కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి భారత్‌లో అనుమతి ఇచ్చాం. ఇప్పడు దేశంలో ఐదు వ్యాక్సిన్లకు ఎమర్జెన్సీ అప్రోవల్ వచ్చింది. కరోనాపై దేశం మొత్తం కలిసి చేస్తున్న ఉమ్మడి పోరాటం మరింత బలోపేతం అయ్యేందుకు ఇది మరింత సహకరిస్తుంది” అని ఆయన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు.