‘నిత్యావసర సరుకులు అమ్మే వ్యాపారులందరికీ కరోనా టెస్టులు’

‘నిత్యావసర సరుకులు అమ్మే వ్యాపారులందరికీ కరోనా టెస్టులు’
  • వారి ద్వారా ఎక్కువ మందికి వైరస్ వ్యాపించే ముప్పు
  • ప్రాణాలు కాపాడడమే లక్ష్యం.. డెత్ రేట్ 1 శాతం దాటకూడదు
  • అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్లస్టర్లను దాటి కొత్త కొత్త ప్రాంతాల్లో వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. క్లస్టర్లలో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటూనే కొత్త ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడమే తొలి ప్రాధాన్యంగా పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ కేంద్రపాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, ఆరోగ్య శాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్. అన్ని ప్రాంతాల్లోనూ కూరగాయలు, కిరాణా సహా అన్ని రకాల నిత్యావసర సరుకులు అమ్మే వ్యాపారులు, ఆ దుకాణాల్లో పని చేసే వర్కర్లకు టెస్టులు చేయాలని సూచించారు. వారికి కరోనా ఉండి గుర్తించడం ఆలస్యమైతే ఎక్కువ మందికి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రాణాలు కాపాడాలంటే ముందుగా గుర్తించాలి

కరోనా వైరస్ బారినపడిన వారి ప్రాణాలను నిలబెట్టడమే లక్ష్యంగా పని చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ కరోనాపై పోరాటంలో చాలా మెరుగ్గా ఉందన్నారు. అయితే కరోనా మరణాల రేటు 1 శాతం కూడా దాటకుండా చూడడమే లక్ష్యంగా మనం పని చేయాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు. టెస్టులు భారీ సంఖ్యలో చేయడం, కరోనా బారినపడిన వారిని ముందుగా గుర్తించడం, ఐసోలేషన్‌కు పంపి సరైన వైద్య సేవలు అందించడం ద్వారా డెత్ రేటును తగ్గించవ్చని అన్నారు. టెస్టులు చేసి వైరస్ బారినపడిన వారిని గుర్తించడం మాత్రమే సరిపోదని, వారికి కండిషన్ క్రిటికల్ కాక ముందే తొలి దశలోనే పసిగట్టి, వైరస్ మరింత మందికి వ్యాపించకుండా అడ్డుకట్ట వేయడం కీలకమని రాజేశ్ భూషణ్ చెప్పారు. జలుబు, జ్వరం, ఇన్‌ఫ్లూయెంజా జబ్బులపై సర్వైలెన్స్ పెంచాలని, ఏ మాత్రం అనుమానం ఉన్నా వెంటనే టెస్టులు చేయాలని సూచించారు. పాజిటివ్ అని తేలితే వేగంగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి, 72 గంటల్లోపే కనీసం 80 శాతం కాంటాక్ట్స్‌ను క్వారంటైన్ చేయగలగాలన్నారు. సాధారణంగా ఒక వ్యక్తికి లక్షణాలు కనిపించే లోపు రెండ్రోజుల్లో సగటున 30 మందిని కాంటాక్ట్ అయ్యే చాన్స్ ఉందని, పరిశ్రమల్లో కార్మికులు, జైళ్లలో ఖైదీలు, వృద్ధాశ్రమాలు, స్లమ్స్‌లో నివసించే వారి నుంచి వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని రాజేశ్ భూషణ్ హెచ్చరించారు. అలాగే కిరాణా, కూరగాయల షాపులు, ఇతర నిత్యావసర సరులకు వ్యాపారాలు నుంచి భారీ హాట్ స్పాట్స్ ఏర్పడే చాన్స్ ఉందని, వీరికి టెస్టింగ్ చేసే విషయంలో ప్రోయాక్టివ్‌గా ఉండాలని ఐసీఎంఆర్ కూడా మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేశారు.

కరోనా మరణాలపై వీక్లీ ఆడిట్

కరోనా మరణాలపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీక్లీ ఆడిట్ నిర్వహించాలని సూచించారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్. మరణానికి కారణమవుతున్న ఫ్యాక్టర్స్‌ని గుర్తించి మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. వయసు, ఇతర అనారోగ్య సమస్యలు (కోమార్బిడ్ కండిషన్స్), కరోనా సోకినట్లు గుర్తించడంలో జాప్యం, బాధితులు ఆలస్యంగా రిపోర్ట్ చేయడం, క్లినికల్ ప్రొటోకాల్‌లో లోపాలను వేర్వేరుగా నమోదు చేసి ఆయా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనుమానితులు సరైన టైమ్‌లో రిపోర్ట్ చేయడంతో పాటు మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకునేందుకు ఈ ఆడిట్స్ ఉపయోగపడుతాయని అన్నారు రాజేశ్ భూషన్. వృద్ధులు, కోమార్బిడ్ కండిషన్లు ఉన్నవారు, గర్భిణులు, వైరస్ ముప్పు ఉన్న వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు రెగ్యులర్ హౌస్ టూ హౌస్ సర్వేలు చేయాలని కోరారు. ఆక్సిజన్ ఫెసిలిటీ ఉండే అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని, అలాగే కోవిడ్ బెడ్స్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టాలని సూచించారు.