రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ

రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ
  • 14 బెటాలియన్ల సిబ్బందిని విధుల్లోకి రప్పించాలని రక్షణ శాఖ నిర్ణయం 

న్యూఢిల్లీ:  పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా టెరిటోరియల్ ఆర్మీలో నమోదైన ప్రతి ఆఫీసర్ ను, సిబ్బంది అందరినీ ఆర్మీకి సహాయం చేసేందుకు రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. శుక్రవారం ఢిల్లీలో సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. టెరిటోరియల్ ఆర్మీ సిబ్బందిని వెంటనే విధుల్లోకి పిలవాలని ఈ మేరకు ఆర్మీ చీఫ్ ను రక్షణ మంత్రి ఆదేశించారు. 

దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 32 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లలో14 బెటాలియన్లను తక్షణమే విధుల్లోకి రప్పించాలని నిర్ణయించారు. టెరిటోరియల్ ఆర్మీ అనేది యుద్ధం, ఇతర అత్యవసర సమయాల్లో భారత సైన్యానికి సహాయక సేవలను అందించే పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన మిలిటరీ రిజర్వ్ ఫోర్స్. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది ఉంటారు.