
ఢిల్లీ : దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరకులను తీసుకునేందుకు పథకం తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది కేంద్రం. ఇందుకోసం చర్యలు చేపట్టినట్లు శనివారం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ (వన్ నేషన్.. వన్ రేషన్‌కార్డు) విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకురానున్నట్లు తెలిపారు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాసవాన్. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రాల్లో వినియోగదారులు ఏ జిల్లాలోనైనా సరకులు పొందుతున్నారని తెలిపారు. దేశంలో ఇప్పటికే పది రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, త్రిపుర, మహారాష్ట్ర) ఈ పథకం అమల్లో ఉందని ‘‘వచ్చే జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్, వన్ రేషన్‌కార్డు’ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేస్తామన్నారు.
ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మేం లేఖలు రాశామని తెలిపారు పాసవాన్. పేదవాళ్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జీవనోపాధి కోసం వెళ్లినా.. వారికి అందే సరకుల విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదని ఆయన అన్నారు. నకిలీ రేషన్ కార్డుల ఏరివేతకూ ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. ఏడాదిలోపు అన్ని ప్రాంతాల్లో అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం గడువు విధించింది. వచ్చే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వచ్చే ఈ పథకం ద్వారా వినియోగదారుడు రేషన్ సరకులను ఇక దేశంలో ఎక్కడి నుంచైనా పొందొచ్చు.