కెనడాలోని మనోళ్లకు కేంద్రం హెచ్చరిక

కెనడాలోని మనోళ్లకు కేంద్రం హెచ్చరిక
  • అక్కడ మనవాళ్లపై దాడులు పెరుగుతున్నయ్‌‌

న్యూఢిల్లీ: మన దేశం నుంచి కెనడాకు వెళ్లేవారు, అక్కడ ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. ఈ మధ్య కాలంలో ఆ దేశంలో విద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస, మన దేశానికి చెందిన వారిపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండియన్లపై జరుగుతున్న ఈ రకమైన దాడులపై దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోవాలని ఆ దేశాన్ని కోరినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

కెనడాలో ఇండియన్లపై ఈ నేరాలకు పాల్పడిన వారిని ఇప్పటివరకు కోర్టు ముందు ప్రవేశపెట్టలేదని చెప్పింది. దీంతో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం కెనడా వెళ్లే ఇండియన్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అక్కడి సిటీల్లోని మన కాన్సులేట్లలో ఇండియన్ స్టూడెంట్లు రిజిస్టర్‌‌‌‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సిక్కులకు ప్రత్యేక దేశం కోరుతూ ఖలిస్థాన్‌‌ అనుకూల శక్తులు కెనడాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం దౌత్యపరంగా వివాదానికి దారితీసిన సమయంలో కేంద్రం ఈ సూచనలు చేసింది.