- తెలంగాణ, ఏపీకి తేల్చి చెప్పిన కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ పునర్విభజన చట్టం–2014 ప్రకారం... తెలంగాణ, ఏపీ తమ ప్రాంతాల్లో ఏ కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టినా వాటి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లను (డీపీఆర్) తప్పనిసరిగా కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) లకు సమర్పించాలని కేంద్రం తేల్చిచెప్పింది.
బోర్డుల పరిశీలన అనంతరం అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాతే ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల వంటి కొత్త ప్రాజెక్టుల అంశంపై లోక్ సభలో గురువారం ఎంపీ మల్లు రవి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2021 జూలై 15నే స్పష్టమైన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.
అయిన్పపటికీ ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే అంశంపై ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అలాగే, కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 2021 అక్టోబర్ 14 నాటికే ప్రాజెక్టులు, హెడ్ వర్క్స్, రిజర్వాయర్లను సంబంధిత రాష్ట్రాలు బోర్డుల ఆధీనంలోకి అప్పగించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. కానీ ఈ ప్రక్రియ పూర్తికాలేదని, దీనిపై బోర్డు మీటింగ్స్‌లో నిరంతరం చర్చిస్తున్నామని సమాధానంలో పొందుపరిచారు.
