వంట నూనెలపై డ్యూటీ 12.5 శాతమే..గురువారం నుంచే అమలులోకి

వంట నూనెలపై డ్యూటీ 12.5 శాతమే..గురువారం నుంచే అమలులోకి

న్యూఢిల్లీ: దేశంలో వంట నూనెల రేట్లను కిందకి తెచ్చే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం ఇంపోర్ట్​ డ్యూటీలను తగ్గించింది. రిఫైన్డ్​ సోయాబీన్​, సన్​ఫ్లవర్​ ఆయిల్స్​పై డ్యూటీని ఇప్పుడున్న 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ తగ్గింపును గురువారం నుంచే అమలులోకి తెచ్చారు. సాధారణంగా సోయాబీన్​  క్రూడ్​, సన్​ఫ్లవర్ ​ క్రూడ్​లనే మన దేశం దిగుమతి చేసుకుంటోంది. రిఫైన్డ్​ ఆయిల్స్​ దిగుమతులు తక్కువే. 

అయినా, రిఫైన్డ్​ ఆయిల్స్​పై డ్యూటీని ప్రభుత్వం కిందకి తెచ్చింది. తాజా తగ్గింపుతో రిఫైన్డ్​ వంట నూనెలపై ఎఫెక్టివ్​ డ్యూటీ 13.70 శాతానికి తగ్గినట్లవుతుంది. డ్యూటీ తగ్గింపు ప్రభావం మార్కెట్​ సెంటిమెంట్​పై  తాత్కాలికంగానే ఉంటుందని సాల్వెంట్​ ఎక్స్​ట్రాక్టర్స్​ అసోసియేషన్​ (ఎస్​ఈఏ) ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ బీ వీ మెహతా చెప్పారు. ఈ తగ్గింపు వల్ల దిగుమతులు  ఆకర్షణీయంగా మారకపోవచ్చని పేర్కొన్నారు. దేశంలో వంట నూనెల రేట్లు దిగి రావాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ తగ్గింపు కూడా ఆ దిశలో తీసుకున్న చొరవేనని మెహతా వివరించారు. 

కేరళకు రుతుపవనాల రాక ఆలస్యమవుతున్న నేపథ్యంలో విత్తనాల నాట్లు వేయడమూ ఆలస్యమవుతోందని ఎస్​ఈఏ తెలిపింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉండొచ్చని ఐఎండీ అంచనా వేస్తున్నా, ఎల్​నినో అవకాశాలను తోసిపుచ్చలేమని, అదే జరిగితే 2023–24 ఆయిల్​ ఇయర్​లో దేశంలోని వంట నూనెల సాగుపై ఆ ఎఫెక్ట్​ పడుతుందని మెహతా వెల్లడించారు.