కాశ్మీర్ నుంచి 100 పారామిలిటరీ బలగాలు వెనక్కి

కాశ్మీర్ నుంచి 100 పారామిలిటరీ బలగాలు వెనక్కి

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌‌లోని సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి 100 కంపెనీలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (ఎంహెచ్‌ఏ) బుధవారం ఈ డెసిజన్ తీసుకుంది. సీఆర్‌‌పీఎఫ్‌కు చెందిన 40 సంస్థలు, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ నుంచి చెరో 20 కంపెనీలను కాశ్మీర్‌‌ లోయ నుంచి వెనక్కి తీసుకోవాల్సిందిగా పారామిలిటరీ అధికారులకు ఆదేశించినట్లు అఫీషియల్స్ చెప్పారు.

జమ్మూ కాశ్మీర్‌‌లో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) విస్తరణను రివ్యూ చేశాకే ఎంహెచ్‌ఏ ఈ నిర్ణయాన్ని ఖరారు చేసింది. దాదాపుగా 100 సీఏపీఎఫ్ కంపెనీలు వెంటనే తాము కార్యకలాపాలు నిర్వహించే బేస్ లోకేషన్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి. ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్‌‌కు ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన సమయంలో గతేడాది ఆగస్టులో ఈ దళాలను లోయలో మోహరించారు. సాధారణంగా ప్రతి సీఏపీఎఫ్ కంపెనీలో వంద మంది సెక్యూరిటీ అధికారులు ఉంటారు. ఈ ఏడాది మేలో లోయ నుంచి పది సీఏపీఎఫ్ కంపెనీలను హోం మంత్రిత్వ శాఖ వెనక్కి తీసుకుంది. తాజాగా వంద కంపెనీలను తమ బేస్ లోకేషన్స్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశించింది.