
బషీర్బాగ్, వెలుగు: కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 44 కార్మిక చట్టాల పునరుద్ధరణకు బలమైన పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, హెచ్ఎండబ్ల్యూఎస్ , ఎస్బీ ట్రేడ్ యూనియన్స్ జేఏసీ చైర్మన్ మొగుళ్ల రాజిరెడ్డి నేతృత్వంలో సిటీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టీజేఈయూ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్, అల్లి శ్రవణ్ కుమార్, ఎండీ జహంగీర్ ఆదివారం బర్కత్ పురాలో సంజీవరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో ఉద్యోగుల వేతనాలు తగ్గుతున్నాయని, పని గంటలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జలమండలిలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, గుర్తింపు సంఘం ఎన్నికలు, దీర్ఘకాలికంగా ఉన్న కార్మికుల పెండింగ్ సమస్యలపై చర్చించారు.