కేంద్రం విధానాలతో బొగ్గు పరిశ్రమ నిర్వీర్యం.. ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయిస్తూ నిర్వీర్యం చేస్తోంది

కేంద్రం విధానాలతో బొగ్గు పరిశ్రమ నిర్వీర్యం.. ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయిస్తూ నిర్వీర్యం చేస్తోంది




గోదావరిఖని, వెలుగు: బొగ్గు పరిశ్రమను వేలం పాట పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్​ పెట్టుబడిదారులకు కేటాయిస్తూ నిర్వీర్యం చేస్తోందని సీఐటీయూ ఆల్​ ఇండియా ప్రెసిడెంట్​ సుదీప్​ దత్తా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఆల్​ ఇండియా కోల్​ వర్కర్స్​ ఫెడరేషన్​ ముగింపు సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్పొరేట్​ సంస్థలు చేజిక్కించుకున్న బొగ్గు బ్లాక్​లలో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రైవేట్​ పెట్టుబడిదారులతో పోటీ పడలేక కోల్​ ఇండియా, సింగరేణి సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలకు కొత్త గనులు కేటాయించకుండా, ఉత్పత్తి కావాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని తెలిపారు. దీంతో కార్మికులపై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు పెరిగే అవకాశాలు  ఉన్నాయని చెప్పారు. సింగరేణి పరిరక్షణ కోసం పలు తీర్మానాలు చేశారు. సంఘం నేతలు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు, ముత్యంరావు, సాయి రెడ్డి, మెండ శ్రీనివాస్, మేదరి సారయ్య, విజయగిరి శ్రీనివాస్, కుంట ప్రవీణ్  పాల్గొన్నారు.