- రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఇంటింటి ఓటర్ల సర్వే కార్యక్రమం సజావుగా సాగేలా అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి కోరారు. శుక్రవారం బీఆర్‌కే భవన్‌లోని సీఈఓ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి, అనర్హులను తొలగించి అత్యంత స్వచ్ఛమైన ఓటరు జాబితాను తయారు చేయడమే సర్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ నెల 25 నుంచి జులై 24 వరకు జరిగే ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు ప్రతి ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తారని, రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) ద్వారా ఈ ప్రక్రియను సరైన పద్ధతిలో పూర్తి చేయించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
మ్యాపింగ్‌తో సంబంధం లేకుండా, ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి సమర్పించిన ప్రతి ఓటరును జులై 31న ప్రచురించే ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చుతామని, ఓటర్లు తమ ఫారాలను ‘voters.eci.gov.in’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చని తెలిపారు. సర్వే సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా సహకరించాలని అన్ని పార్టీలకు సీఈఓ విజ్ఞప్తి చేశారు.
